కూలిన చెట్లు.. పొంగిన డ్రెయిన్లు

కంచికచర్ల, ఆంధ్రప్రభ : మొంథా తుఫాన్ ప్రభావంతో కంచికచర్ల మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
తుఫాన్ తీరం దాటిన తర్వాత మంగళవారం రాత్రి నుండి బుధవారం మధ్యాహ్నం వరకు భారీ ఈదురు గాలులలతో కూడిన వర్షం కురిసింది. మంగళవారం ఉదయానికి సుమారు 7 సెంటీ మీటర్లు వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. ఈదురు గాలులు వీయటంతో బుధవారం ఉదయం 10 గంటల దాకా ప్రజలు బయటకు రాలేదు.
చలిగాలులకు తోడు చీకట్లు అలుముకోవటంతో అత్యవసరాలకు సైతం ప్రజలు బయటకు రాక వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. భారీ వర్షానికి డ్రైన్లు పొంగి వర్షం నీరు రోడ్లపైకి ప్రవహించటంతో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. స్తానిక వసంతకాలనీ, ఇందిరా కాలనీ, జంగాల కాలనీలకు వరదనీరు ఇళ్ళల్లోకి చేరింది.
దీంతో అధికారులు హుటాహుటిన ఆయా ప్రాంతాల్లోని బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. మండలంలోని పరిటాల, గని ఆత్కూరు, కీసర, కంచికచర్లలో 4 పునరావాస కేంద్లాల్లో సుమారు 50 కుటుంబాలకు చెందిన 170 మంది బాధితును తరలించినట్లు తహశీల్దార్ నరశింహారావు తెలిపారు.
భారీ వర్షాలకు కంచికచర్ల ఆర్టీసి బస్టాండ్ ఆవరణ నీట మునిగింది. దీంతో బస్టాండ్ కు బస్సులు రావటానికి ఆటంకం ఏర్పడింది. ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం లోకి మోకాలు లోతు నీరు చేరాయి. స్తానిక జుజ్జూరు రోడ్డు, గొట్టుముక్కల రోడ్, జాతీయ రహదారిపై సైతం వరదనీరు పారింది.
మరోప్రక్క ఈదురుగాలుకు కంచికచర్లతో పాటు పలు గ్రామాల్లో చెట్లు విరిగిపోయాయి. కొన్నిచోట్ల హోర్డింగులు పడిపోయాయి. కరంటు స్తంభాలు నేలకొరిగిపోయాయి. దీంతో విద్యుత్ సఫరాకు అంతరాయం ఏర్డపడింది. వెంటనే స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు పడిపోయిన చెట్లను తొలగించారు.
విద్యుత్ స్తంభాలు సరి చేసి విద్యుత్ సరఫరాను పునరుధ్ధరించారు. బుధవారం మధ్యాహ్నం నుంచి వర్షం తగ్గింది. ఈదురుగా గాలులు మాత్రం వీస్తున్నాయి. రెండు రోజులుగా ఇబ్బందులు పడిన ప్రజలు ఇప్పుడిప్పుడే జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు.
