గుంతలమయంగా మారిన రోడ్డు..
ఉట్నూర్, ఆంధ్రప్రభ : రోడ్ల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల బడ్జెట్ నిధులు కేటాయిస్తున్నామని చెబుతున్నా ఎన్నో సంవత్సరాలుగా నిర్మించిన ప్రధాన రోడ్లకు గుంతలు ఏర్పడి కనీసం మరమ్మతులకు నోచుకోవటం లేదు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ నుండి జన్నారం వైపు వెళ్లే ప్రధాన రోడ్డు బీర్సాయిపేట్ సమీపంలో కిలోమీటర్ పైగా గుంతల మయంగా మారింది.
అక్కడక్కడ పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా వాటిని పూడ్చకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతూ వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వానదారులు ఇబ్బందులు పడుతున్నా ఆర్ఆర్బి శాఖ అధికారులు కనీసం గుంతలు పడ్డ రోడ్లకు మరమ్మతులు కూడ చేయించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు, ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఈ రోడ్డు వైపు నుండి గతంలో అధిక లోడుతో తిరిగే భారీ వాహనాలను అటవీశాఖ అధికారులు నిషేధించారు.

మళ్లీ అతి లోడుతో నడిచే భారీ వాహనాలకు అనుమతి ఇవ్వడంతో రోడ్డు మరింత చెడిపోతుందని చాలామంది ప్రజలు పేర్కొంటున్నారు. ఈ రోడ్డు వెంట ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రయాణిస్తున్న వారు కూడా చూసి చూడనట్లు వ్యవహరించడంతో వాహనదారులు, ప్రయాణికులు సంవత్సరాల తరబడి ఇబ్బందులు పడక తప్పడం లేదు. గుంతలు పడ్డ రోడ్డుకి బాధ్యత ఎవరిదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని గుంతల మయంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేయించాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.
యువకులు శ్రమదానం చేసినా చలనం లేదా
మండలంలోని ఉట్నూరు నుండి జన్నారం వెళ్లే ప్రధాన రోడ్డు దంతనపల్లి సమీపంలోని బ్రిడ్జి వద్ద అతిపెద్ద గుంతలు ఏర్పడడంతో ఆ ఊరికి చెందిన యువకులు ఇటీవల శ్రమదానంతో గుంతలు పూడ్చారు. దీంతో వాన రాకపోకలకు ఇబ్బందులు తొలిగాయి యువకులు శ్రమదానం చేసిన సంబంధిత శాఖ అధికారులు ఎలాంటి చలనం రావటం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. బీర్సాయిపేట సమీపంలో కిలోమీటర్ పైగా గుంతల మయంగా ఏర్పడ్డ రోడ్డు దుస్థితిని పట్టించుకునే నాథులు కరువయ్యారని వాహనదారులు, ప్రజలు పేర్కొంటున్నారు.



