శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
వరంగల్ క్రైమ్ అక్టోబర్ 25 (ఆంధ్రప్రభ) డయల్ 100 ఫిర్యాదుల పై తక్షణమే స్పందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఠాణాల వారిగా రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడొద్దని వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ తెగేసి చెప్పారు. వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధికి చెందిన నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని కాకతీయ విశ్వవిద్యాలయము సమావేశ ప్రాంగణంలో శనివారం నిర్వహించారు. వరంగల్ కమిషనరేట్ కు చెందిన పోలీస్ అధికారులు పాల్గొన్న ఈ సమీక్షా సమావేశంలో పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ముందుగా సుధీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను సమీక్షించారు. పెండింగ్ కేసుల విషయంలో ఉదాసీనత పనికి రాదని తేల్చి చెప్పారు. కేసుల పెండింగ్ కు గల కారణాలను పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసుల పరిష్కారం కోసం అధికారులు తీసుకోవాల్సిన చర్యల పై పోలీస్ కమిషనర్ అధికారులకు మార్గ నిర్ధేశ్యం చేశారు.
ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్ల పై కఠినంగా వ్యవహరించాలి అన్నారు. గత కొద్ది కాలంగా స్థానికంగా లేని రౌడీ షీటర్ల, ప్రస్తుతం నివాసం వుంటున్న ప్రాంతానికి చెందిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చోరీలకు పాల్పడిన నిందితులతో పాటు, గంజాయి విక్రయాలకు పాల్పడే వారి పై హిస్టరీ షీట్లను తెరవాలని ఆదేశించారు. సైబర్ నేరాల్లో కేవలం బాధితులకు నష్టపోయిన సొమ్మును తిరిగి ఇప్పించడమే కాకుండా, నిందితుడి పట్టుకునేందుకు స్టేషన్ అధికారులు కృషి చేయాలన్నారు. పొక్సో కేసులకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలన్ని గడువు లోపు పూర్తి చేయాలన్నారు. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ అధికారిగా ఎస్సై స్థాయి అధికారే తప్పక విధులను నిర్వర్తించాలని ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసుల తరహాలోనే స్టేషన్ అధికారులు తమ పరిధిలో పెండింగ్ లో వున్న ట్రాఫిక్ జరిమానాదారులకు ఫోన్ చేసి జరిమానా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
చోరీ కేసుల్లో రికవరీ శాతాన్ని పెంచాలని మార్గ నిర్ధేశ్యం చేశారు. చోరీలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయడంతో పాటు నిందితులు దేశంలో ఎక్కడ వున్నా అరెస్టు చేసేందుకు పోలీస్ అధికారులు ప్రణాళికను రూపోందించుకోవాలన్నారు. కేసుల్లోని నిందితులను అరెస్టు చేయడంలో స్టేషన్ అధికారులు అలసత్వం వహించోద్దన్నారు. నేరాల నియంత్రణ కై పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల భాగస్వామ్యంతో పాటు సిసి కెమెరాల ఏర్పాటుకై కృషి చేయాలన్నారు. సిసి కెమెరాల వినియోగం పై ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. ముఖ్యంగా నిందితులకు ఖచ్చితంగా శిక్షలు పడేలా పోలీస్ అధికారులు దర్యాప్తు చేపట్టాలన్నారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో నేర చరిత్ర వున్న వ్యక్తుల ప్రస్తుత స్థితిగతుల పై వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్ కేసులను ట్రాఫిక్ పోలీసులతో పాటు, లా అండ్ ఆర్డర్ పోలీసులు నమోదు చేయాలన్నారు. పోలీస్ స్టేషన్లలలో ఆహ్లదకరమైన వాతవరణం కోసం మొక్కల పెంపకంతో పాటు స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండే జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఇందు కోసం ప్రతి శుక్రవారం పోలీస్ స్టేషన్లో శ్రమదానం చేయాలని సిపి సన్ ప్రీత్ సింగ్ పోలీస్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్, వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్, వరంగల్, జనగాం ఏఎస్పీ శుభం ప్రకాష్, చేతన్‌నితిన్, అదనపు డిసిపిలు రవి, రాయల ప్రభాకర్‌రావు, బాలస్వామితో పాటు ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఎస్.ఐలు పాల్గోన్నారు.

