తిరుపతి-కాట్పాడి డబ్లింగ్ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
నోటిఫికేషన్ జారీ
ఎనిమిది నెలల్లో భూసేకరణ పూర్తి చేసేందుకు చర్యలు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వే లైన్‌ను రెండు వరుసలుగా విస్తరించేందుకు ఎనిమిది నెలల్లో అవసరమైన స్థలాన్ని రైల్వేశాఖకు అప్పగించనున్నారు. పాకాల-కాట్పాడి మధ్య ఉన్న లైన్ చిత్తూరు జిల్లా పరిధిలోకి వస్తుంది. జిల్లాలో వచ్చే ఏడాది మార్చి నాటికి సర్వే ప్రక్రియను కొలిక్కి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈలోగా డబ్లింగ్ పనులకు టెండర్లు ఖరారయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వేలైన్‌ను డబ్లింగ్ చేయాలన్నది దశాబ్దాలుగా ఉమ్మడి చిత్తూరు జిల్లావాసుల డిమాండ్. ఏప్రిల్‌లో కేంద్ర కేబినెట్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినా భూసేకరణపై రైల్వేశాఖ నుంచి స్పష్టత లేదు. ప్రాథమికంగా తిరుపతి-పాకాల వరకు సర్వే చేసినా పాకాల-కాట్పాడి లైన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా జిల్లాతోపాటు తమిళనాడులోని వేలూరు జిల్లాలోనూ భూసేకరణ దిశగా కదలాలని రైల్వేశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. రెవెన్యూ శాఖ అధికారులు ఈ అంశంపై దృష్టి సారించనున్నారు.

రూ.1,332 కోట్లతో పనులు
తిరుపతి-పాకాల-కాట్పాడి మధ్య 104 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులకు ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రూ.1,332 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్ పనులతో 35 లక్షల పనిదినాలు కల్పించే అవకాశం ఉంది. ఈ పనుల ద్వారా 400 గ్రామాల్లోని 14 లక్షల మంది జనాభా లబ్ధి పొందనున్నారు. మరోవైపు పర్యాటకంగా ఎంతో అభివృద్ధి జరిగేందుకు ఆస్కారం ఉంది. లక్షల సంఖ్యలో సందర్శకులు ఈ మార్గంలో తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ డబ్లింగ్ ప్రాంతంలోనే చంద్రగిరి కోట కూడా ఉంది. అలాగే ఏటా రూ.120.85 కోట్ల ఆదాయం పెరుగుతుందని, 24 నిమిషాలు సమయం ఆదా అవుతుందని రైల్వే అధికారులు అంచనా వేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో తిరుపతి- పాకాల డబ్లింగ్‌కు ప్రాథమికంగా సర్వే పూర్తి చేశారు. త్వరగా భూసేకరణ చేసి రైల్వేశాఖకు అప్పగించి, వీలైనంత త్వరగా పనులు పూర్తయ్యేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పాకాల-కాట్పాడి మధ్య లైన్ చిత్తూరు జిల్లాలో ఉంది. ఇక్కడ భూసేకరణ త్వరగా పూర్తిచేయాలని చూస్తున్నారు. తిరుపతి-పాకాల మధ్య రైలు మార్గాన్ని డబ్లింగ్ చేయడానికి సర్వే పూర్తయింది. భూసేకరణ త్వరగా చేసి రైల్వేశాఖకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు.
సీఎం సొంత జిల్లా కావడంతో..
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా కావడంతో ఈ రైల్వే లైన్‌పై ఫోకస్ పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జండా ఉపింది. ఇప్పుడు డబ్లింగ్ పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు రైల్వే అధికారులు. తిరుపతి-పాకాల-కాట్పాడి రైలు మార్గంలో రోజూ 40కిపైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఒకే లైన్ ఉండటంతో చిత్తూరులో ముఖ్యమైన రైళ్లు ఆగడం లేదు. ప్రయాణికులు తిరుపతి లేదా కాట్పాడిలో దిగాల్సిందే. ఎక్స్‌ప్రెస్ రైళ్లు వస్తే ప్యాసింజర్లు ఆగాల్సిందే. ఈ ఇబ్బందులు తీర్చేందుకు డబ్లింగ్ చేయాలన్న ప్రతిపాదనలకు కూటమి ప్రభుత్వంలో మోక్షం కలిగింది. డబ్లింగ్ పూర్తయితే చిత్తూరు, తిరుపతి జిల్లాలు పర్యాటకం, పారిశ్రామికంగా పురోగమిస్తాయి. శ్రీసిటీ, రేణిగుంట, ఏర్పేడు ఈఎంసీలు, గూడూరు, సూళ్లూరుపేటలోని పారిశ్రామికవాడలతోపాటు చిత్తూరు జిల్లా నుంచి గ్రానైట్, మామిడి ఉత్పత్తుల రవాణా సులభతరమవుతుంది. అదేవిధంగా తిరుపతి, వెల్లూరు ప్రాంతాలు వైద్య, విద్య హబ్‌లుగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ రీజియన్‌కు లబ్ధి చేకూరుతుంది. ఎలక్ట్రానిక్స్, సిమెంట్, స్టీల్ తయారీ కంపెనీలు లబ్ధి పొందనున్నాయి. ప్రాజెక్టు ద్వారా చిత్తూరు, తిరుపతి, వెల్లూరు జిల్లాకు లబ్ధి చేకూరుతుంది. ఇందులో భాగంగా 17 మేజర్, 327 మైనర్ వంతెనలు వస్తున్నాయి. అదేవిధంగా 7 పైవంతెనలు, 30 అండర్ పాస్ బ్రిడ్జిలు రానున్నాయి.
