నిబంధ‌న‌ల‌కు తిలోద‌కాలు

ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ప్రైవేటు ట్రావెల్స్
ప్రైవేటు బ‌స్సుల్లో భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు ఎక్క‌డా?

ప‌ల్నాడుబ్యూరో,(ఆంధ్ర‌ప్ర‌భ‌): చిల‌క‌లూరిపేట‌కు స‌మీపంలో 2024 మే 15 తెల్ల‌వారుజాము ప్రైవేటు ట్రావెల్ బ‌స్సు ను టిప్పర్ లారీ ఢీకొట్టింది. టిప్పర్ ఢీకొట్టిన వెంటనే ఆయిల్ ట్యాంక్ ప‌గిలిపోవ‌డం, రాపిడికి మంటలు చెలరేగి బ‌స్సుకు మంట‌లు అంటుకున్నాయి. ఏం జ‌రుగుతుందో తెలిసేలోగానే ఆరుగురు ప్ర‌యాణికులు గాఢ నిద్ర నుంచి శాశ్వ‌త నిద్ర‌కు జారుకున్నారు.
2013 అక్టోబర్‌ 30న బెంగళూరు–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట మండలంలోని పాలెం గ్రామం వద్ద వోల్వో బస్సు ప్రమాదానికి గురై 45 మంది సజీవదహనమయ్యారు.
2017 ఫిబ్రవరి 28న భువనేశ్వర్‌ నుంచి హైదరాబాద్‌ వెళుతున్న దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు కృష్ణా జిల్లా ముండ్లపాడు వద్ద ప్రమాదానికి గురై 10 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా శుక్ర‌వారం తెల్ల‌వారు జామున కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి.20 మందికి పైగా మృతి చెందారు.

ప్రయాణికుల ప్రాణాలను ఫ‌ణంగా పెట్టి ట్రావెల్స్‌ నిర్వాహకులు బస్సుల్నితిప్పుతున్నారు. ఉభ‌య గుంటూరు జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహ‌కులు ప్ర‌యాణికుల ర‌ద్దీకి అనుగుణంగా నిబంధ‌న‌ల‌కు తిలోద‌కాలు ఇచ్చి బ‌స్సులు న‌డ‌ప‌టం ప‌రిపాటిగా మారింది. ఉభయ గుంటూరు జిల్లా నుంచి ప్ర‌తి గ్రామం, ప్ర‌తి ప‌ట్ట‌ణంలో ప్ర‌త్యేక కౌంట‌ర్లు ఏర్పాటు చేసి దేశంలోని సుదూర ప్రాంతాల‌కు ప్రైవేటు ట్రావెల్ బ‌స్సులు నిరాటంకంగా తిరుగుతునే ఉంటాయి. ఏదైనా ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు హ‌డావిడి చేయ‌డం, అనంత‌రం ఆ విష‌యం మ‌రిచిపోవ‌డం జ‌రుగుతున్న తంతే.

అక్ర‌మార్జ‌నే ధ్యేయంగా…
కాంట్రాక్టు క్యారేజీ అనుమతులతో స్టేజి క్యారియర్లుగా ప్రైవేట్‌ ట్రావెల్స్ నిర్వాహ‌కులు తెలుగు రాష్ట్రాల్లో బస్సుల్ని తిప్పుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఆలిండియా పర్మిట్లు పొంది నిబంధనలకు విరుద్ధంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తిప్పుతున్నారు. కేంద్ర మోటారు వాహన చట్టం–1989 నిబంధనలను అతిక్రమించి తిప్పుతున్న ఈ బస్సుల జోలికి ఏ స్థాయి గ‌ల ర‌వాణాశాఖాధికారి వెళ్లాల‌నే సాహసం చేయ‌క‌పోవ‌డం విశేషం. దీన్ని బ‌ట్టే ప్రైవేటు ట్రావెల్స్ వెనుక ఎంత పెద్ద మాఫీయా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. ప్రయాణికుల భద్రతను సవాల్‌ చేస్తూ ప్రైవేటు ట్రావెల్స్‌ ఏకంగా టూ ప్లస్‌ వన్‌ బెర్తులతో తిప్పుతున్నా.. రవాణా శాఖ బ‌స్సుల‌పై చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వంగా వీరు తీసుకున్న లైసెన్సుల ప్ర‌కారం స్టేజీ క్యారియర్లుగా ప్రయాణికులను ఎక్కించుకో కూడ‌దు. ప్ర‌తి చిన్న ప‌ట్ట‌ణం, గ్రామంలోనూ ప్ర‌యాణికుల‌ను ఎక్కించుకుంటునే ఉంటారు. టూరిజాన్ని ప్రోత్సహిస్తున్న అరుణాచల్‌ ప్రదేశ్, పాండిచ్చేరిలలో రవాణా శాఖ ట్యాక్స్‌లు చాలా తక్కువగా ఉంటాయి. ఏడాదికి ఒక బస్సుకు రూ. 17 వేలు చెల్లించి ఆలిండియా పర్మిట్‌ పొందవచ్చు. అదే తెలుగు రాష్ట్రాల్లో పర్మిట్లు పొందాలంటే మూడు నెలలకోసారి బస్సులో ఒక్కో సీటుకు ఏపీలో అయితే రూ. 3,750, తెలంగాణలో రూ. 3,675 చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు ట్రావెల్స్‌ తమ బస్సుల్ని అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నారు. నిజానికి అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించి పర్మిట్‌ పొందాలంటే ఆ రాష్ట్రం మీదుగాకానీ, ఆ రాష్ట్రంలోగానీ బస్సులు తిరగాలి. కానీ ప్రైవేటు ట్రావెల్స్‌ ఆ పర్మిట్లతో హైదరాబాద్‌, షిర్డీ, బెంగళూరు, చెన్నై, భువనేశ్వర్‌ తదితర ప్రాంతాలకు బస్సుల్ని తిప్పుతున్నారు.

ఫిట్‌నెస్ లేని బ‌స్సుల‌తో ఇక్క‌ట్లు ..
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల దందా నడుస్తోంది. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌, వేసవి సెలవుల్లో టికెట్‌ ధరలు ఒక్కసారిగా పెంచేస్తున్నారు. కేవలం సీటుకే సుమారు పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేల వరకు దండుకుంటున్నారు. ఫిట్‌నెస్‌ లేని బస్సులను నడపటంతో అవి ఎక్కడపడితే అక్కడ మొరాయిస్తున్నాయి. ఆ సమయంలో ప్రత్యామ్నాయ సర్వీసు ఏర్పాటు చేయాల్సి ఉన్నా యాజమాన్యాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. ప్ర‌స్తుతం క‌ర్నూలు బ‌స్సు ఘ‌ట‌న‌లోనూ ఫిట్ లేక‌పోవ‌డం ఒక కార‌ణంగా విశ్లేషిస్తున్నారు. మార్గమధ్యలో బస్సుల్లో సాంకేతిక లోపాలు వచ్చినప్పుడు సదరు సంస్థ ప్రత్యామ్నాయంగా మరో బస్సును ఏర్పాటు చేయాల్సి ఉన్నా చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు.

Leave a Reply