వయా ఆత్మకూరు రాకపోకలు బంద్
నంద్యాల, ఆంధ్ర ప్రభ బ్యూరో : నంద్యాల జిల్లాలో గత వారం రోజులగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా గురువారం 423.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. భారీ వర్షాలతో నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి దోర్నాలకు వెళ్లే దారిలో రోళ్లపెంట దాటిన తర్వాత 15 కిలోమీటర్ల దూరంలో ఓ పెద్ద వాగు పరవళ్లు తొక్కతోంది. రోడ్డుపై ఐదు అడుగుల నీరు ప్రవహిస్తోంది.
దీంతో ఆళ్లగడ్డ డీఎస్పీ రామాంజి నాయక్, సీఐ రాము వాగు ప్రాంతానికి చేరుకున్నారు. ఆ రహదారి గుండా వెళ్లే వాహనాల దారిని మళ్లించారు. దోర్నాల నుంచి ఆత్మకూరు కి వచ్చే వాహనాలను నిలిపివేశారు. సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు అనేక అవస్థలు ఇబ్బందులు పడ్డారు. దోర్నాల పోలీసులు దోర్నాల్లోని వాహనాలను నిలిపివేస్తున్నారు. ఆత్మకూరు వద్దనే వాహనాలను దారి మళ్లింపు చేశారు.వాహనాలను నంద్యాల మీదుగా డైవర్షన్ చేశారు.
కాబట్టి దోర్నాలకు వెళ్లాలంటే వయా నంద్యాల మీదుగా జనం వెళ్తున్నారు. .కర్నూలు నుంచి వచ్చే ప్రయాణికులు డైరెక్ట్ గా నంద్యాల మీదుగా గిద్దలూరు వైపు వెళ్ళవలసి ఉంటుందన్నారు. వరద ప్రవాహం తగ్గినట్లయితే మళ్లీ రాకపోకలు పునరుద్దిస్తామన్నారు. ప్రయాణికుల క్షేమం దృష్ట్యా వాహనాలను దారి మళ్ళించామని ప్రజలు సహకరించవలసిందిగా కోరారు.