తుని కీచకుడి ఆత్మహత్య పై డౌటనుమానాలు

తుని కీచకుడి ఆత్మహత్య పై డౌటనుమానాలు

( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి )
అతడు ఒక లీడర్. కౌన్సిలర్. ఈ దళిత నాయకుడిని సభ్య సమాజం అమితంగా గౌరవించింది. కానీ.. గతి తప్పాడు. కామోద్రేకంలో.. అమాయక మైనర్ బాలికను చెరబట్టాడు. అంతే సాటి జనం అతడిని ఈసడించుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇప్పటి వరకూ తనకు వంగి వంగి సలాం చేసిన జనమే చీత్కరించుకుని.. జైలుకు పంపిస్తుంటే.. ఈ హీనబతుకు వద్దనుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటి వరకూ ఈ కథనం ఓకే.. కానీ ఈ కేసులో నిందితుడి ఆత్మహత్యే అనుమానాలను పెంచింది. నిజంగా అతడే ఆత్మహత్య చేసుకున్నాడా? లేక జనం కొట్టిన దెబ్బలకు చనిపోయాడా? అనే అనుమానాలు తెర మీదకు వచ్చాయి. ఈ ఘటనను ఓ సారి పరిశీలిద్దాం.

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని పట్టణంలో సంచలనం రేపిన ఈ ఘటన తీరుతెన్నూ ఇది. తాటిక నారాయణ రావు, తుని పట్టణంలోని కొండవారి పేట కౌన్సిలర్, టీడీపీ దళిత నాయకుడు. 13 ఏళ్ల భర్త లేని ఒంటరి తల్లి కుమార్తె జగన్నాథగిరి ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. నారాయణను తాతయ్య” అని పిలుస్తుంది. కౌన్సిలర్ కావటంతో గురుకుల సిబ్బంది వద్ద విశ్వాసం పొందాడు. గత 4-5 సార్లు హాస్టల్ నుంచి బాలికను బయటకు తీసుకెళ్లాడు. అక్టోబర్ 22, 2025 (మంగళవారం) హాస్టల్ కు వెళ్లాడు. మధ్యాహ్నం 11 గంటలకు ఇంజెక్షన్ చేయించాలి అని చెప్పి బాలికను హాస్టల్ నుంచి తీసుకెళ్లాడు. తుని మండలం హంసవరం శివారులోని నిర్మానుష్య తోటలోకి తీసుకెళ్లి, ఆమెను వివస్త్రను చేసి లైంగిక దాడికి యత్నించాడు. తోట కాపలాదారుడు గమనించి అడ్డుకున్నాడు, వీడియో తీశాడు. నారాయణ రావు నేను కౌన్సిలర్‌ను అంటూ బెదిరించాడు. కాపలాదారుడు బాలిక కుటుంబానికి సమాచారం ఇచ్చాడు. అతడు తీసిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఆగ్రహంతో… స్థానికులు, కుటుంబ సభ్యులు నారాయణ రావును చితకబాది పోలీసులకు అప్పగించారు.

ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. తుని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. POCSO చట్టం, కిడ్నాప్ తదితర మూడు కేసులు నమోదు చేశారు. నిందితుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు కావటంతో – వైసీపీ నాయకులు, దళిత సంఘాలు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ కూడా కఠిన చర్యలకు ఆదేశించారు. 15 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేసి, 30 ఏళ్లకు పైగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు తెలిపారు. ఇక – అక్టోబర్ 23 (బుధవారం అర్ధరాత్రి) గురువారం తెల్లవారుజామున మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తుని పోలీస్ స్టేషన్ నుంచి నిందితుడిని కోర్టుకు తరలిస్తుండగా, బహిర్గభూమికి వెళ్లాలని నిందితడు చెప్పాడు. తుని శివారులోని కోమటి చెరువు (పాండ్) దగ్గర వాహనం ఆపారు. అంతే నిందితుడు అకస్మాత్తుగా చెరువులోకి దూకాడు. గజఈతగాళ్లు, డ్రోన్‌లు, డైవర్ల సాయంతో రాత్రంతా పోలీసులు గాలించారు. నారాయణ మృతదేహం గురువారం ఉదయం లభించింది. పోస్ట్‌మార్టం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇక్కడే అనుమానాలెన్నో..
ఇక్కడ వరకూ పోలీసు కథనం ఓకే. నిందితుడిని చట్ట ప్రకారం తీవ్రంగా.. కఠినంగా శిక్షించాల్సిందే. మరో నేరగాడు లైంగిక దాడులకు దిగకూడదు. బుధవారం మధ్యాహ్నం జనం చితక కొట్టిన మాట వాస్తవం. చట్టప్రకారం అతడు గాయపడ్డాడా? లేదా? అని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకు వెళ్లాలి. అలాగే అరెస్టుకు ముందు కూడా వైద్య పరీక్షలు జరిపించాలి. మరి ఇతడిని పోలీసులు యయర్జెంటుగా మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చటానికి ఎందుకు తొందర పడ్డారు? అర్ధరాత్రి లేదా తెల్లవారు జామున మెజిస్ర్టేట్ మెలుకగా ఉంటారా? అంత అత్యవసర కేసుగా కిడ్నాప్, లైంగిక దాడి కేసులో పోక్సో నిందితుడు పారిపోతాడని పోలీసులు ఎలా అనుమానించారు? అతడు ఒక కౌన్పిలర్.. ఆయనకు హామీ ఇచ్చే జనమూ ఉంటారు. కానీ ఇక్కడ నారాయణ ఆత్మహత్యే జరిగిన తీరే అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఇంతటి కిరాతక కీచకుడిని చంపేస్తేనే బాధితులు తాత్కాలికంగా సంతృప్తి చెందటం ఖాయం. సాధారణంగా ఇలాంటి నేరగాళ్లను ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండు ఇటీవల సమాజంలో మార్మోగిపోతోంది. ఈ స్థితిలోనే.. అతడి ఆత్మహత్య అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడు దొరికిన మృతదేహం అసలు నిజాలను కక్కుతుంది. చావు దెబ్బలతో చచ్చిపోయాడా? చేసిన పాపాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడా? అసలు నిజాలు త్వరలోనే వెలుగులోకి రావటం ఖాయం.

Leave a Reply