కృష్ణాలో అల్లకల్లోలం
జన జీవనం అస్తవ్యస్తం
(ఆంధ్రప్రభ – కృష్ణా జిల్లా ప్రతినిధి) : కృష్ణా జిల్లాలో కుంభ వృష్టి అతలాకుతలం చేస్తోంది. గురువారం ఉదయం నాటికి కృష్ణా జిల్లా (Krishna District) లో క్లౌడ్ బరస్ట్ తరహాలో… జిల్లా మొత్తం మీద 89.52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, సగటును 34.4 సెంటీమీటర్ల వర్షం పడింది. ఏడు నియోజకవర్గాల్లో భారీ వర్షం కురవటంతో ప్రధాన రహదారులు జలమయంగా మారాయి. వరుణదేవుడు ఎడతెరపి లేని వర్షం కురిపిస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. గత రెండు రోజులుగా ఉదయం, రాత్రి తేడా లేకుండా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి.
కృష్ణా జిల్లాలో చివరి ప్రాంతమైన దివిసీమలో భారీగా వర్షం (Heavy Rain) కురవటంతో గోతులమయంగా మారిన రహదారుల్లో ప్రజలు ప్రయాణం చేయలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోడూరు మండల పరిధిలోని హంసలదీవి బీచ్ గేట్లు సైతం రెండు రోజులపాటు అధికారులు మూసివేశారు. గుడివాడ, అవనిగడ్డ, మచిలీపట్నం, పామర్రు, గన్నవరం, గుడివాడ, పెడన ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన నెలకొంది. వరి కంకి పాలుపోసుకునే సమయంలో వర్షం పడుతుండటంతో మానుగాయి తెగులు వచ్చి పంటకు నష్టం చేకూరుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా జిల్లాకు వర్ష సూచన ఉందని తెలియజేయటంతో రైతులు కంగారు పడుతున్నారు.
నదీ పరివాహక ప్రాంతాల (River basins) ప్రజలు సైతం వర్షంతో వరద పెరిగితే తాము ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 26 మండలాల్లో వర్షం రెండు రోజులుగా కురుస్తూనే ఉంది. సూర్యుడు ఏ మాత్రం కనిపించకుండా ఆగి ఆగి వర్షపు జల్లులు, వర్షం కురుస్తోంది. జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని ప్రధాన రహదారులు నీటిముంపులోనే ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపర్చని ప్రధాన రహదారులన్నీ నీటి ముంపులో ఉండటంతో వాహనదారులు, ప్రజలు అవస్థలు పడ్డారు. మచిలీపట్నంలో మంగినపూడి బీచు వెళ్లే రహదారిలో భారీ వృక్షం నేలకొరగటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సాయంత్రం వరకు భారీ వృక్షం తొలగించేందుకు సిబ్బంది శ్రమించారు.