ఏపీజీబీలో మూడు బ్యాంకుల విలీన ఫలితం

రుణగ్రస్తులకు వడ్డీల శఠగోపం
ఖాతాదారుల లావాదేవీలకు గండి
ఏటీఎం అడగొద్దు
18, 500 మంది ఖాతాదారులకు చుక్కలు

ఆంధ్రప్రభ, అర్ధవీడు ( ప్రకాశం జిల్లా ) : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ (పాత పేరు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ) (APGBank) తన ఖాతాదారుల కొంపను నిట్టనిలువునా ముంచుతోంది. దాదాపు 11 రోజులుగా సర్వర్ ను సరి చేసుకోలేక ఖాతాదారులతో చెలగాటం ఆడుతోంది. బ్యాంకు సేవలకు గండి పడింది. ఖాతాదారుల దినసరి ఆదాయం ఆవిరవుతోంది. మరో అధిక వడ్డీ రూపంలో రుణగ్రస్తుల నడ్డి విరుస్తోంది. విత్ డ్రాయల్స్ కు ఏకంగా ఎగనామం పెడుతోంది.

ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గా ఇటీవల పేరు మార్చుకుంది. సప్తగిరి, చైతన్య గోదావరి, ఆంధ్ర వికాస్ గ్రామీణ బ్యాంక్ (Andhra Vikas Gramin Bank) లతో విలీనం కావడంతో ఈ మార్పు జరిగింది. ఈ ప్రక్రియలో తలెత్తే సమస్యల పరిష్కారం కోసం తొలి మూడు రోజులు అన్ని రకాల సేవలను నిలిపేసింది. దీంతో ఇబ్బంది పడ్డా.. ఖాతాదారులు అర్ధం చేసుకున్నారు. ఆ తరువాత ఒక్క ఎటిఎం సేవలు మినహా అన్ని పునరుద్దరించామని ఈ నెల 13 వ తేదీన ప్రకటించింది.

ఊపిరి పీల్చుకున్న ఖాతాదారులు (Clients) బ్యాంకుకు వెళితే.. వారికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. దాదాపు 18, 500 మంది ఖాతాదారులు వున్నా ఈ బ్యాంకులో నిమిష నిమిషానికి సర్వర్ మోరాయిస్తోంది. దీంతో కాలి పిక్కలు వాచేలా కౌంటర్ల వద్ద ఖాతాదారులు నిలుచునే పరిస్థితి దాపురించింది. ఒక ఆర్థిక వ్యవహారం పూర్తి చేసుకునేందుకు రోజుల తరబడి బ్యాంకు చుట్టు తిరగాల్సి వస్తోంది. ఇందుకోసం ఆర్థిక వ్యాయాన్ని, విలువైన సమయాన్ని బ్యాంకు అసమర్ధతకు ఖాతాదారు మూల్యంగా చెల్లించాల్సి వస్తోంది. నిత్యం వడ్డీతో కూడిన ఋణం చెల్లించే డ్వాక్రా గ్రూపులు దాదాపు 600, రైతుల ఖాతాలు 2300 వున్నాయి.

నిర్నీత సమయంలో రుణ చెల్లింపునకు వెళ్లిన వీరితో బ్యాంకరు లావాదేవీలు (transactions) జరపడం లేదు. రోజుల తరబడి తిప్పుకుంటున్నారు. గడువు దాటితే వేసే అధిక వడ్డీని ఎవరు భారాయించాలని ప్రశ్నిస్తున్నారు. ఇదే కాదు, డిమాండ్ ఆధారంగా చేయాల్సిన విత్ డ్రాయల్స్ ను సైతం తమ ఇస్తానికి నిలిపేస్తున్నారు. సర్వర్ మోరాయింపు సమస్య, పరిష్కారం బ్యాంకరకు సంబంధించింది. కోట్ల రూపాయల టర్నవర్ ఇస్తున్న గ్రామీణ ఖాతాదారుది కాదు. అలాంటప్పుడు గడువు తీరిన వడ్డీలకు బ్యాంకు మినహాయిస్తుందా? లేక తన అసమర్ధతను ఆర్ బి ఐ కి తెలీకుండా ఖాతాదారుల కొంప ముంచుతుందా? అంటే నడ్డి విరిచే పరిస్థితి కనిపిస్తోంది.

Leave a Reply