తిరుపతిని ముంచేసిన వ‌రుణుడు

లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం
రాక‌పోక‌లు స్తంభ‌న‌.. ప్ర‌జ‌ల‌కు తీవ్ర ఇబ్బందులు
విద్యా సంస్థ‌ల‌కు సెల‌వు


తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): తిరుపతి (Tirupati) ని వ‌రుణుడు ముంచేసాడు. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు బుధవారం ఉదయం మరింత తీవ్రరూపం దాల్చడంతో లోత‌ట్టు ప్రాంతాలు నీట‌మునిగాయి. నగరంలోని అనేక కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. లెనిన్‌నగర్, పోస్టల్‌కాలనీ, జీవకోన, అక్కరంపల్లె, కొర్లగుంట, బలాజీకొలనీ, రామానుజనగర్, నారాయణపురం, వెస్ట్‌చర్చి, ఆర్‌సీగేట్, ఈస్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలోని అండర్ పాస్‌లలో నీరు నిలిచి వాహనాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమైన రహదారులు చిన్నచిన్న చెరువుల్లా మారడంతో తిరుపతి సిటీలో రాకపోకలు పూర్తిగా స్థంభించిపోయాయి.

తీవ్ర వర్షాల (HeavyRain) కారణంగా చిన్న వ్యాపారులు, దినసరి కూలీలు తీవ్రంగా నష్టపోయారు. వీధుల్లో నీరు నిలవడంతో పాదచారులు కూడా బయటకు రావడానికి ఇబ్బందిపడ్డారు. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకటి అలుముకుంది. తిరుపతి కార్పొరేషన్ అధికారులు నీటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా పని మందగిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఎక్కడైనా నీటమునిగిన ప్రాంతాల్లో సహాయక బృందాలు పర్యటిస్తూ ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నాయి. అధికారులు వర్షం తగ్గేవరకు బయటకు వెళ్లవద్దని సూచించారు.


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో రెండు రోజులుగా కుండపోత వర్షాలు (Torrential rains) కురుస్తున్నాయి. వాకాడు, సుల్లూరుపేట, తిరుపతి సిటీ, తిరుమల, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు మండలాలు వరద నీటితో తడిసి ముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగి, రాకపోకలు స్తంభించి, జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ప్రైవేట్ (అన్‌ఎయిడెడ్) పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించారు.


వర్షాల నేపథ్యంలో తిరుపతి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ (ఫోన్ నెం. 0877-2236007) ప్రారంభించినట్లు కలెక్టర్ (Collector) తెలిపారు. అదే విధంగా ప్రతి రెవెన్యూ డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు తమ పరిధిలోని శాఖలతో సమీక్షా సమావేశాలు నిర్వహించి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు సైతం వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తమ ప్రాంత అధికారులను సంప్రదించాలని, అవసరమైతే తప్ప అనవసర ప్రయాణాలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. విపత్తు సమయంలో తగిన విధంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి గంటకు నివేదికలు సమర్పించాలని, అప్రమత్తత చర్యలలో ఎటువంటి ఆలస్యం లేకుండా ప్రజల రక్షణ, ఆహారం, నీరు, ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉండాలని, ఈ నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave a Reply