నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : భారత్‌పై ట్రంప్ విధిస్తున్న అధిక సుంకాలను నిరసిస్తూ ప్రజాసంఘాలు ఆదివారం సాయిబాబా నగర్ సెంటర్ వద్ద నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతు సంఘం కార్యదర్శి రామచంద్రుడు కౌలు రైతు సంఘం నాయకుడు నర్సింహ్మ నాయక్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి నాగరాజు లక్ష్మణులు మాట్లాడారు. భారతదేశానికి నష్టం కలిగించే టారిఫ్ లు రద్దు చేయాలన్నారు. ట్రంప్‌నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికీ భారతదేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు.
ప్రధానమంత్రి మోదీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు లొంగిపోయి, వారు చెప్పినట్లు డూడూ బసవన్నలాగా తల ఊపుతున్నారని ఆరోపించారు. సరిపడా నిల్వ ఉన్న పత్తి పంట పై సుంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం వల్ల దేశంలో పత్తి రైతులకు గిట్టుబాటు ధరలు ఉండవన్నారు. పత్తిపై ఆధారపడిన వస్త్ర పరిశ్రమలు, అందులో పని చేస్తున్న కార్మికులకు ఉపాధి లేకుండా పోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎగుమతి చేసే ఆక్వారంగ రైతాంగం తీవ్రంగా నష్టపోతారన్నారు.
దేశంలోని ప్రజలందరూ రాజకీయాలకతీతంగా ట్రంప్ అధిక టారిఫ్ లను వ్యతిరేకించాలన్నారు. నాడు నరకాసుర సంహారంతో దీపావళి జరుపుకున్న ప్రజలు, రాక్షసుడి లాగా మన దేశాన్ని దోచుకు తింటున్న ట్రంప్ విధిస్తున్న సుంకాలకు అడ్డుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ట్రంప్ ఫోటోలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు యేసు రత్నం, జిల్లా నాయకులు బాల వెంకట్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఏ. సురేష్, శ్రీనివాసరెడ్డి, రాజు, చెన్నయ్య ,కృష్ణ, రత్నమయ్య తదితరులు పాల్గొన్నారు.