భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: మర్యాదలకు పుట్టినిల్లు పశ్చిమగోదావరి జిల్లా.. అటువంటి పశ్చిమగోదావరి జిల్లాలో కొత్త అల్లుడు తొలిసారి ఇంటికి వచ్చాడు అంటే అత్తమామలు పసందైన వంటకాలకు స్వాగతం పలుకుతున్నారు. వందల సంఖ్యలో వంటకాలు టేబుల్ పై ఉంచి అల్లుడికి కొసరి.. కొసరి.. వడ్డించి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో కొత్త అల్లుడికి ఇటువంటి మర్యాదలు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరానికి చెందిన తులసి రాంబాబు దంపుతుల కుమార్తె గోవర్ధని వివాహాన్ని విశాఖపట్నం చెందిన రాహుల్ తో ఈ నెల 11న వైభవంగా నిర్వహించారు. వివాహం జరిగిన తర్వాత తొలిసారి దీపావళి పండగకు అత్తగారింటికి వచ్చిన అల్లుడికి మామయ్య తులసి రాంబాబు అద్భుతమైన విందును కళ్ళ ముందు ఉంచారు. అల్లుడు రాకను పురస్కరించుకుని తన బంధు,మిత్రులందరికీ కూడా సుమారు 100 రకాల వంటలతో విందు భోజనాన్ని అందించారు. అల్లుడు రాహుల్ కి 150 రకాల దేశీయ, విదేశీయ వంటకాలతో తన ఆప్యాయతను చాటుకున్నారు. పులస, పండుగప్ప, కోరమేను, నాటుకోడి, బొమ్మిడాయిలు, అపోలో ఫిష్, రొయ్యలు, పీతలు వంటి నాన్ వెజ్ వంటకాలతో పాటు పదుల సంఖ్యలో వెజ్ వంటకాలు, రకరకాల స్వీట్లు వంటి వాటిని ఈ విందులో అందించారు.
తాను జీవితంలో ఇటువంటి విందును ఎప్పుడూ చూడలేదని తనపై ఉన్న ప్రేమకు చిహ్నం ఈ విందుగా భావిస్తున్నానని రాహుల్ తెలిపారు. ఈ సందర్భంగా తులసి రాంబాబు మాట్లాడుతూ తనకు కుమార్తె అంటే ఎంత ప్రేమ అల్లుడంటే అంతే గౌరవం అన్నారు. నేను ఇచ్చే తొలి విందును జీవితంలో మర్చిపోకూడదని ఆలోచనతో ఇన్ని రకాల వంటకాలను సిద్ధం చేసి అందించామన్నారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన సంస్కృతి.. సంప్రదాయాలను.. మర్యాదలను.. మర్చిపోకూడదనే ఆలోచనతోటి ఈ విధంగా విందును ఏర్పాటు చేశామని రాంబాబు ఆంధ్రప్రభ కు తెలిపారు.