అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు కేసులో..

అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు కేసులో..

త‌ప్పుడు సాక్ష్యం చెప్పించే ప్ర‌య‌త్నం

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం దేవలంపేట అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పించే ప్రయత్నం చేసిన కానిస్టేబుల్ గంగయ్యను చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ సస్పెండ్ చేశారు. రాష్ట్రంలో సంచలం కలిగించిన ఈ కేసులో తప్పుడు ప్రచారం చేసి, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినందుకు వైసీపీకి చెందిన దళిత సర్పంచ్ గోవిందయ్యను పోలీసులు కేసు పెట్టి రిమాండ్‌కు పంపారు. అయితే అధికార పలుకుబడి కలిగిన ఒక వర్గం టీడీపీ నాయకులు ప్రత్యర్థి వర్గానికి చెందిన సతీష్ నాయుడు, కిషన్ చంద్ పై నేరం నెట్టే ప్రయత్నం చేశారు. నిందితుడు గోవిందయ్యతో చేతులు కలిపి సంఘటన జరిగిన రోజు అదే విషయం మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వద్ద చెప్పించారు.

అయితే పోలీసుల దర్యాప్తులో అసలు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టలేదని, పక్క నున్న మహిళ షెడ్డు నుంచి ఎగిరి పడిన కొబ్బరి ఆకుల వల్ల ప్రమాద వశాత్తూ విగ్రహం కొంత కాలిందని తేల్చారు. అయితే దీనిపై లోతైన దర్యాప్తు చేయాలని కుట్ర వెనక గుట్టు విప్పాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందని భయపడిన టిడిపి నేతలు పోలీసులను ప్రలోభ పరచి సతీష్ నాయుడు, కిషన్ చంద్ పై తప్పుడు సాక్ష్యం చెప్పించే ప్రయత్నం చేశారు.

ఈ నేపథ్యంలో ఈనెల 13 వ తేదీ రాత్రి వెదురుకుప్పం పోలీసు కానిస్టేబుల్ గంగయ్య దేవళం పేటకు చెందిన అరుణ్ అనే వ్యక్తిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నాడు. కాళ్లకు ఇనుప గొలుసు వేసి కిటికీకి కట్టి చితక గొట్టాడు. సతీష్ నాయుడు, కిషన్ చంద్ అతని వద్ద విగ్రహానికి నిప్పు పెట్టించినట్టు చేయని నేరాన్ని ఒప్పుకోమని హింసించాడు. తీవ్రంగా కొట్టడంతో ఆయనకు తల ఒంటిపై గాయాలు అయ్యాయి.
అయితే నేరం జరిగిన రోజు అరుణ్ తిరుపతిలోని తన అక్క వారి ఇంటిలో ఉన్నట్టు అతని కుటుంబ సభ్యులు సీసీ కెమెరా ఫుటేజ్ తెచ్చి చూపడంతో కానిస్టేబుల్ వదిలి పెట్టాడు.

అయితే అరుణ్ వంటిపై తగిలిన దెబ్బలకు చికిత్స చేసుకోవాలని తిరుపతి రుయా ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్లకు నిజం చెప్పడంతో వారు మెడికో లీగల్ కేసు నమోదు చేసి వెదురుకుప్పం పోలీసులకు తెలిపారు. ఈ విషయం బయటికి పొక్కడంతో టిడిపి నేత సుధాకర్ రెడ్డి, కొందరు మీడియా వారు అరుణ్ ను కలసి కానిస్టేబుల్ చేసిన చట్ట వ్యతిరేక వ్యవహారాన్ని బయట పెట్టారు. బాధితుడు అరుణ్, అతని కుటుంబ సభ్యులు, సతీష్ నాయుడు, కిషన్ చంద్ ఎస్పీని కలసి పూర్తి వివరాలు అందించారు. దీనితో పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎస్పీ చర్యలు తీసుకున్నారు.

Leave a Reply