హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట గ్రామానికి చెందిన పారా త్రోబాల్ ప్లేయర్ మిట్టపల్లి అర్చనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు.
స్వతహాగా ఎదిగి ఖేలో ఇండియా నేషనల్ లెవెల్ పారా త్రోబాల్ స్థాయిలో సత్తా చాటి ఇప్పుడు ఇండియా తరపున తెలంగాణ నుంచి శ్రీలంకలో పారా త్రోబాల్ ఆడడానికి అర్హత సాధించారు.
పేద కుటుంబానికి చెందిన అర్చనకు చిన్నతనం నుంచే క్రీడలంటే ఆసక్తి. అద్దె ఇంట్లో ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ తనకు ఇష్టమైన ఆటలో గెలుపే లక్ష్యంగా కృషిచేస్తున్నారు.
ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చి, ఆమెకు ఆటకు సంబంధించిన క్రీడా పరికరాలు, ఆర్థిక సహాయం చేశారు.