లొంగుబాట‌లో మ‌రో 208 మంది….

  • మావోయిస్టు చరిత్రలో రికార్డు..

ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ : ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ఎదుట మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపెల్లి వాసుదేవరావు (అలియాస్ ఆశన్న, అలియాస్ రూపేష్) సహా మొత్తం 208 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ లొంగుబాటులో వివిధ కేడర్లకు చెందిన సభ్యులు ఉన్నారు.

లొంగిపోయిన వారిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. వారిలో ఒకరు కేంద్ర కమిటీ సభ్యుడు, నలుగురు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, ఒక ప్రాంతీయ కమిటీ సభ్యుడు, 21 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 61 మంది ఏరియా కమిటీ సభ్యులు, 98 మంది పార్టీ సభ్యులు కాగా, మిగిలిన 22 మంది ఇతర కేడర్లకు సంబంధించిన వారు ఉన్నారు.

ఒకప్పుడు భారతదేశంలో వామపక్ష తీవ్రవాదానికి కంచుకోటగా ఉన్న బస్తర్ డివిజన్ ఇకపై అభివృద్ధి పథంలో నడుస్తుందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, మావోయిస్టుల‌ లొంగుబాటు గురించి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి మీడియాతో మాట్లాడుతూ, ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసే వారిని ప్రశంసించారు. మావోయిస్టుల‌ లొంగుబాటు ఛత్తీస్‌గఢ్‌కే కాకుండా, మొత్తం దేశానికే చారిత్రాత్మకమైన రోజు అని ఆయన అభివర్ణించారు.

రాజ్యాంగంపై నమ్మకం చూపిస్తూ పెద్ద సంఖ్యలో నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి చేరుతున్నారని తెలిపారు. ఆయుధాలు వదిలి లొంగిపోయేవారిని తాము స్వాగతిస్తున్నామని, వారికి నైపుణ్యం, పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని తుదముట్టిస్తామని హోంమంత్రి ఇదివరకే ప్రకటించారు. ఆపరేషన్ కగార్ చేపట్టి విస్తృతంగా కూంబింగ్ చర్యలు నిర్వహించారు. మావోలు ఆయుధాలు వదిలి లొంగిపోవాలని, లేదంటే వారికి భద్రతా బలగాలు సరియైన సమాధానం చెబుతాయని సీఎం స్పష్టం చేశారు.

Leave a Reply