ఖర్చులు అధికం.. గిట్టుబాటు అత్యల్పం

ఖర్చులు అధికం.. గిట్టుబాటు అత్యల్పం

చిత్తూరు వేరుశనగ రైతన్న విలవిల
మదుపులో అప్పుల కుదుపు
అందుకే రైతన్నకు నీరసం

( చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో) ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో పల్లెలన్నీ వేరుశనగ వాసనతో కళకళలాడేవి. రైతు కుటుంబాలకు ఆర్థికంగా బలమైన ఆధారంగా నిలిచిన వేరుశనగ పంట, ఇప్పుడు క్రమంగా కనుమరుగైపోతోంది. పదేళ్ల కిందటి వరకు జిల్లాలో వేలాది ఎకరాల్లో ఈ పంట పండేది. కానీ ఇప్పుడు ఆ దృశ్యం చిత్రంగా మారింది. ఎండ, కరువు కాటకాలు, అకాల వర్షాలు, బీమా సమస్యలు, అడవి పందుల బెడదలు అన్ని కలసి రైతులను వేరుశనగ సాగు నుండి దూరం చేశాయి. చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు 35, 000 హెక్టార్లలో వేరుశనగ పంట సాగు కావాల్చి ఉండగా కేవలం 1,500 హెక్టార్లలో మాత్రమే సాగు కావడంతో.. ఇక పల్లీ సాగు వల్లె వేసే స్థితికి చేరినట్టే.

శనగ కథ .. కంచికే

చిత్తూరు జిల్లాలో 2014–15 నాటికి సుమారు 35,000 నుండి 40,000 హెక్టార్లలో వేరుశనగ సాగు జరిగింది. ముఖ్యంగా గంగవరం, పిచ్చాటూరు, పలమనేరు, రొంపిచర్ల, పెనుమూరు, యాదమరి, సత్యవేదు, నాగలాపురం మండలాలు వేరుశనగ ప్రధాన ఉత్పత్తి కేంద్రాలుగా నిలిచాయి. అప్పుడు వర్షపాతం సగటుగా ఉండడం, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండడం వల్ల రైతులు మంచి దిగుబడి సాధించారు. ఒక్కో ఎకరాకు సగటున 8–10 క్వింటాళ్ల దిగుబడి లభించేది. ఆ సమయంలో వేరుశనగ ధర కూడా క్వింటాళ్లకు రూ.5,000 నుండి 6,000 మధ్య ఉండేది. 2016 తర్వాత జిల్లా వాతావరణం గణనీయంగా మారిపోయింది. ఒకసారి వర్షాభావం, మరోసారి అతివృష్టి ఈ రెండూ పంటకు ప్రమాదకరంగా మారాయి. 2014 నుండి 2017 వరకు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కొనసాగాయి. వేరుశనగ పంటలు ఎండిపోయాయి. 2018–19లో కొన్ని మండలాల్లో అధిక వర్షాలు కురవడంతో పంటలు చేతికి రాలేదు. 2020లో కరువు మళ్లీ పట్టుకుంది. 2021–22లో భారీ వర్షాలు, వరదలు రావడంతో విత్తనాలు మట్టిలోనే కుళ్లిపోయాయి. ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడకపోవడంతో వేరుశనగ సాగు కాలేదు. ఈ అయోమయ వాతావరణ పరిస్థితులు రైతుల నమ్మకాన్ని కోల్పోయేలా చేశాయి. పంట నష్టాలు మళ్లీ మళ్లీ రావడంతో రైతులు మామిడి తోటల వైపు తమ దృష్టిని మళ్లడం మొదలైంది. 2015 నాటికి చిత్తూరు జిల్లాలో సుమారు 36,000 హెక్టార్లలో వేరుశనగ పంట సాగు జరిగేది. 2018 నాటికి ఇది 20,000 హెక్టార్లకు, 2020 నాటికి 10,000 హెక్టార్లకు, 2023 నాటికి 4,500 హెక్టార్లకు తగ్గిపోయింది. ప్రస్తుత 2025–26 వ్యవసాయ సంవత్సరంలో మాత్రం కేవలం 1,500 హెక్టార్లలో మాత్రమే వేరుశనగ పంట వేశారు.

అష్టకష్టాల శనిగా..

వేరుశనగ పంట నష్టపోయినప్పుడల్లా రైతులు ఆశ్రయించే మార్గం పంట బీమా పథకమే. అయితే గత కొన్ని సంవత్సరాలుగా బీమా క్లెయిమ్‌లు చెల్లించకపోవడం, భీమా ప్రీమియం మొత్తాన్ని రైతులే భరించాల్సి రావడం పెద్ద సమస్యగా మారింది. గత సంవత్సరం వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయినా, రైతులకు ఇప్పటివరకు బీమా సంస్థలు లేదా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదు. ప్రభుత్వం బీమా మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసే పద్ధతి లేకపోవడంతో నష్టం చవిచూసిన రైతులు నిరాశలో ఉన్నారు. చిత్తూరు జిల్లాలోని అడవులకు ఆనుకుని ఉన్న గ్రామాల రైతులు గత ఐదేళ్లుగా అడవి పందుల దాడులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పందులు రాత్రిపూట పొలాల్లోకి దూరి వేరుశనగ మొక్కలను పీకివేయడం, పంటను తినేయడం వంటివి రోజువారీ సమస్యలుగా మారాయి. రైతులు గోడలు కట్టడం, విద్యుత్ కంచెలు వేయడం వంటి చర్యలు తీసుకున్నా ఫలితం తక్కువగానే ఉంది. వ్యవసాయ శాఖ, అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో కేవలం 1,500 హెక్టార్లలో మాత్రమే వేరుశనగ సాగు జరిగింది. ఇది చిత్తూరు జిల్లా వ్యవసాయ చరిత్రలోనే అతి తక్కువ స్థాయి. రైతులు ఖర్చులు, ప్రమాదాలు చూసి పంట వేసే ధైర్యం కోల్పోయారు. ఈ నేపధ్యంలో వేరుశనగ పంట బీమా మొత్తాలను తక్షణం విడుదల చేయాలని, బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వం భరించే విధానాన్ని పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. అలాగే అడవి పందుల నియంత్రణకు సమగ్ర చర్యలు తీసుకోవాలని, వేరుశనగకు కనీస మద్దతు ధర పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, సబ్సిడీలను సమయానికి అందించాలని మనవి చేస్తున్నారు.

వెన్నుదన్ను లేకనే..

చిత్తూరు జిల్లా మట్టికి వేరుశనగ పంట సహజమైనది. ప్రతీ ఏడాది విత్తనాలు, ఎరువులు, మందుల ఖర్చులు పెరుగుతున్నాయి. కానీ వాతావరణం సహకరించడంలేదు. దిగుబడులు తగ్గిపోయాయి. బీమా సొమ్ము రాలేదు. అందుకే ఇక వేరుశనగ వేసే ధైర్యం లేకపోతోంది అని రైతులు వాపోతున్నారు. చిన్న రైతులు భూమి, విత్తనం, ఎరువు ఖర్చు అన్నీ చేసి వేసిన వేరుశనగ వర్షాలు లేక ఎండిపోయినా, బీమా సొమ్ము రాకపోవడంలో దిగాలు చెందితున్నారు. పలమనేరు, యాదమరి, పెనుమూరు ప్రాంతాల్లోనూ ఉంది. పంట పాడైపోయి, అప్పులు పాలై రైతులు నష్టాల్లో మునిగిపోయారు. అయితే ఈ పంట మళ్లీ రైతుల భూముల్లో పుష్పించాలంటే ప్రభుత్వం, వ్యవసాయ శాఖ, విత్తన సంస్థలు, బీమా కంపెనీలు కలసి ముందుకు రావాలి. ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇవ్వకపోతే, చిత్తూరు జిల్లాలో వేరుశనగ పంట చరిత్రలో ఒక అధ్యాయంగా మిగిలిపోతుందనే ఆందోళన రైతులలో వ్యక్తమవుతోంది.

Leave a Reply