ఇదే జూబ్లీహిల్స్లో విజయానికి నాంది
హైదరాబాద్, ఆంధ్రప్రభ : మీ కసి, పట్టుదల, తపన జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి నాంది కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు(K. Tarakarama Rao) (కేటీఆర్) అన్నారు. ఈ రోజు రహమత్ నగర్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
మన రక్తంలోనే పోరాటం ఉందని, మొక్కవోని ధైర్యంతో ఉన్నామని, చిన్న వయస్సులోనే మాగంటి గోపినాథ్Maganti Gopinath) మరణించారని, ఆడబిడ్డలకు చిరు కానుకలు ఇస్తూ ఆదుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్(Congress) పాలనపై ఆగ్రహంతో ఉన్నవారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసపోయిన ప్రతి ఒక్కరినీ కలిసి బాకీ కార్డులు పంపిణీ చేయాలని, ప్రతి ఇంటికీ కాంగ్రెస్ బాకీ పడ్డ విషయాలను వివరించాలని, గులాబీ జెండా రెపరెపలాడాలని కేటీఆర్ అన్నారు.
కారు, బుల్డోజర్కు మధ్య జరుగుతున్న పోరు
ఈ రోజు ఉప ఎన్నికలు కారు, బుల్డోజర్(Bulldozer)కు మధ్య జరుగుతున్నాయని కేటీఆర్ అన్నారు. కారు రావాలంటే మాగంటి సునీతా గోపీనాథ్ గెలవాలన్నారు. రెండు లక్షల ఉద్యోగాల్లో కనీసం ఐదు శాతం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, మోసపోయిన అన్నాచెల్లెళ్లు జూబ్లీహిల్స్ వైపే చూస్తున్నారని, ఆటో డ్రైవర్లు మొదలుకొని బస్ డ్రైవర్ల(Bus Drivers) అందరి చూపూ జూబ్లీహిల్స్ ఎన్నికల వైపే ఉందన్నారు.
గత ఎన్నికల్లో హైదరాబాద్లో ఒక్క సీటు ఇవ్వకుండా కేసీఆర్కు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇల్లు కూలగొట్టడమా? ఎంతో మంది నిరుపేద, గరీబోళ్లను రోడ్లపైకి చేర్చిందని విమర్శించారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు కళ్లు బైర్లు కమ్మేలా కొడితేనే ఆరు గ్యారంటీలు వస్తాయన్నారు. నెల రోజులు గట్టిగా కొట్లాడుదామన్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి(Revanth Reddy) లాంటి దివాళా కోరు ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ తరపున అజారుద్దీన్ పోటీ చేశారని, ఇప్పుడు ఎమ్మెల్సీ అంటూ అజారుద్దీన్(Azharuddin)ను మభ్యపెట్టి పక్కకు పెట్టారని విమర్శించారు. అజారుద్దీన్ను ఎలా మోసం చేశారో, సేమ్ బీసీలను కూడా అలాగే మోసం చేశారని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని నమ్మంచి చివరకు కోర్టుల మీద నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.
అందుకే కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని, అందుకే ఇదే సరైన సమయం అని అన్నారు. జూబ్లీహిల్స్లో దెబ్బ కొడితే ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్(High Command)కు దెబ్బ తగలాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతలు అప్పుడే అక్రమాలకు తెరతీశారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్లో ఒకే ఇంట్లో 43 ఓట్లు రాయించారని ఆరోపించారు. దొంగ ఓట్లను ఎదుర్కోవడంపై పార్టీ పరంగా దృష్టి సారించామని చెప్పారు.