నల్గొండ : నల్గొండ జిల్లాను కుదిపేసిన భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. పీఏపల్లి మండలం వద్దిపట్ల గ్రామానికి చెందిన రమావత్ బాలాజీ అనే వ్యక్తి అధిక వడ్డీ ఇస్తానని నమ్మబలికి ప్రజల నుంచి సుమారు రూ.50 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేసినట్టు పోలీసులు ధ్రువీకరించారు. బాధితుల ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఈ కేసు వివరాలు ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియావు వివరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలాజీ మోసాల పర్వం 2020లో ప్రారంభమైంది. 2020లో ఐస్‌క్రీమ్ పార్లర్ వ్యాపారం పేరు చెప్పి, తన బంధువుల నుంచి నెలకు 2% వడ్డీకి రూ.5 లక్షల వరకు అప్పుగా తీసుకున్నాడు. ఐస్‌క్రీమ్ వ్యాపారంలో నష్టం రావడంతో.. రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించి, తన గ్రామంలోని ఇతర వ్యక్తుల నుంచి 6% అధిక వడ్డీకి రూ.15 లక్షలు సేకరించాడు.
క్రమంగా, బాలాజీ కొందరిని ఏజెంట్లుగా నియమించుకుని, చుట్టుపక్కల ఉన్న గిరిజన తండాల్లో అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ రూ.10 వడ్డీ ఇస్తానంటూ.. అధిక డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. సేకరించిన కోట్లాది రూపాయలతో బాలాజీ తన బంధువుల పేర్లపై ఇళ్లు, వ్యవసాయ భూములు, ఖరీదైన కార్లు, బైక్‌లు కొనుగోలు చేసి విలాసవంతమైన జీవితం గడిపాడు.
కొత్త బాధితులను ఆకర్షించడానికి ఎక్కువ వడ్డీ ఇస్తానని వాగ్దానం చేసి, వారి నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేశాడు. బ్యాంకు వడ్డీ కంటే 10 రెట్లు ఎక్కువ వడ్డీ ఇస్తుండటంతో.. చాలా మంది ఆకర్షితులై, అధిక మొత్తంలో బాలాజీకి డబ్బులు ఇచ్చారు. అయితే, కొద్ది నెలల పాటు కేవలం వడ్డీ మాత్రమే చెల్లిస్తూ, ప్రామిసరీ నోట్లు ఇస్తూ, అసలు డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడు. చివరికి, బాధితులకు వడ్డీ, అసలు చెల్లించకుండా అతను పారిపోయాడు.
అదుపులోకి తీసుకున్న పోలీసులు
బాధితులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో బాలాజీని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రెండు లగ్జరీ కార్లు, 7 మొబైల్ ఫోన్లు, ప్రామిసరీ నోట్లు, ఆస్తి పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలాజీని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నామని, ఈ మోసంలో ఇంకా ఎవరైనా భాగస్వాములు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అధిక వడ్డీ ఆశకు పోయి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.