కొత్త సంస్కరణలతో ఎంతో మేలు..
- ప్రజల ఆరోగ్య భద్రతకు సరికొత్త భరోసా..
- జీవిత, ఆరోగ్య కుటుంబ బీమా, ప్రాణ రక్షక మందులపై సున్నా జీఎస్టీ..
- విప్లవాత్మక సంస్కరణలపై గ్రామస్థాయి నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు..
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ..
(ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి చొరవతో అందుబాటులోకి వచ్చిన జీఎస్టీ సంస్కరణల ఫలాలతో సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుందని.. సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్‌తో సామాన్యుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తున్నాయని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ (Collector Dr. G. Lakshmi) అన్నారు. విజయవాడలోని ఓల్డ్ జీజీహెచ్ వద్ద గురువారం ఉదయం సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీని కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, జీఎస్టీ విజయవాడ జాయింట్ కమిషనర్ ఎస్.ప్రశాంత్ కుమార్.. అధికారులతో పాటు ఎన్టీఆర్ జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.

ఈసందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ… సూపర్ జీఎస్టీ 2.0 (Super GST 2.0) తో వివిధ రంగాల్లో భారం తగ్గిందని.. జీవిత బీమాపై పాత రేటు 18శాతం ఉంటే ఇప్పుడది సున్నా శాతం అయిందని, ఆరోగ్య-కుటుంబ బీమాలోనూ ఇదే రకమైన మినహాయింపు అందుబాటులోకి వచ్చిందన్నారు. గతంలో ప్రాణ రక్షక మందులపై జీఎస్టీ 12శాతం ఉంటే ఇప్పుడది సున్నా శాతం అయిందన్నారు. వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ కిట్లపై 12శాతం ఉన్న పన్ను 5 శాతానికి తగ్గిందన్నారు. ఈ సంస్కరణలతో జరుగుతున్న మేలుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయి నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రులు, రైతు సేవా కేంద్రాలు, అంగన్వాడీలు, విద్యా సంస్థలు.. ఇలా ప్రతిచోటా అవగాహన కల్పిస్తున్నామన్నారు.

జీఎస్టీ రేట్ల తగ్గింపు (GST rates Reduction) తో ఆదా అయిన సొమ్ము ప్రజల జీవితాలకు కొత్త దిశను చూపిస్తాయని, ఈ డబ్బు పెట్టుబడి కోసం, చదువుకోసం, డిపాజిట్ల కోసం.. ఇలా వివిధ రకాలుగా సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. కొత్త జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్ర ప్రజలకు రూ.8వేల కోట్లు, జిల్లా ప్రజలకు దాదాపు రూ.300 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుందన్నారు. ఇంత మంచి అవగాహన కార్యక్రమంలో భాగస్వాములైన జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ (Collector S. S. Ilakkiya) మాట్లాడుతూ… ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ఆసుపత్రులు, డయాగ్నిస్టిక్ట్ కేంద్రాలు.. ఇలా ప్రతిచోటా కొత్త జీఎస్టీ సంస్కరణలతో కలుగుతున్న ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జీవిత, ఆరోగ్య బీమాలకు సంబంధించి అధిక ప్రయోజనాలు సామాన్యులకు చేరువవుతున్నాయన్నారు. జీవిత బీమాలో తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ లభిస్తుందని, ఆరోగ్య కుటుంబ బీమాలో ప్రతి రెన్యువల్‌లోనూ 18శాతం ఆదా అవుతుందని వివరించారు. చికిత్సా ఖర్చులు, పరీక్షల ఖర్చులూ తగ్గుతాయని జేసీ ఇలక్కియ వెల్లడించారు.
జీఎస్టీ విజయవాడ జాయింట్ కమిషనర్ ఎస్.ప్రశాంత్ కుమార్ (S.Prashanth Kumar) మాట్లాడుతూ… సాధారణ మందులపై పాత జీఎస్టీ 12 శాతం ఉంటే ఇప్పుడది 5 శాతానికి తగ్గిందని, టెస్టింగ్ కిట్లుపై పాత జీఎస్టీ 12 శాతం ఉంటే ఇప్పుడది 5 శాతానికి తగ్గిందన్నారు. వైద్య ఆరోగ్య రంగంతో పాటు వివిధ రంగాల్లో జీఎస్టీ సంస్కరణలతో కలుగుతున్న ప్రయోజనాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్య సేవల రంగంలో జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలను డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని వివరించారు.
కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాధు ప్రసాద్, సెక్రటరీ డీవీఆర్ సాయికుమార్, ట్రెజరర్ జి.శ్రీహరిరావు, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, ఔషధ నియంత్రణ పరిపాలన అసిస్టెంట్ డైరెక్టర్ కె. అనిల్ కుమార్, జీఎస్టీ గొల్లపూడి సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ ఎస్.ప్రజ్ఞా రాధిక, ఆసుపత్రి వైద్యాధికారులు, జీఎస్టీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.