నేతన్నలకు మరిన్ని ఆర్డర్లు ఇస్తాం..
- త్వరలోనే మహిళా సంఘాలకు చీరలు..
- కార్మికులకు ప్రతీ రోజు పని కల్పించాలి..
- రాష్ట్ర మంత్రి సీతక్క
రాజన్న సిరిసిల్ల, ఆంధ్రప్రభ : కోటి మంది మహిళలను కోటీశ్వరుల(Millionaires)ను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి సీతక్క ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా నేత కార్మికులు నేసిన చీరలను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి(KK Mahender Reddy)తో కలసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క చీరలు నేచే విధానం దగ్గరుండి పరిశీలించి కార్మికుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళా మండలి మహిళలకు ఇవ్వాల్సిన ఇందిరా శక్తి మహిళ చీరల యూనిఫామ్‌లను కొన్ని కారణాల వల్ల సరైన సమయానికి ఇవ్వకపోయామని, త్వరలోనే ఈ చీరల పంపిణీ జరిగేలా చూస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వర్(Tummala Nageshwar) ఆదేశాలతో నేతన్నలకు 64 లక్షల చీరలు ఆర్డర్ చేశామన్నారు.
నేతన్నలు పడుతున్న కష్ట సుఖాలను స్వయంగా చూశానని, రానున్నరోజుల్లో నేతన్నలకు మరిన్నిఆర్డర్లు ఇస్తామన్నారు. నేతన్నలకు ఉపయోగ పడే యరస్ డిపో 50 కోట్లతో వేములవాడలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం పెట్టిన నేతన్న బకాయిలు ప్రజా ప్రభుత్వంలో తీర్చడం జరిగిందన్నారు. కోటి మంది మన వాళ్లను కోటీశ్వరులను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సంకల్పించారన్నారు.
ఇందులో భాగంగానే మహిళలకు పెట్రోల్ బంకులు(Petrol Banks), సోలార్ ప్లాంట్, ఆర్టీసీ బస్సులు, బస్సులో ఉచిత ప్రయాణం వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. మహిళలకు ఆదాయాన్ని సమకూర్చడం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మహిళా సంఘాల బలోపేతనికి రాష్ట్ర ప్రభుత్వం(State Govt.) కృషి చేస్తోందన్నారు. మహిళా సంఘాల సభ్యులకు ఏక రూప దుస్తులను పంపిణీ చేస్తామన్నారు. నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి నిరంతరం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.