పైడిమాంబకు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ప్రణామం

  • పైడితల్లికి పట్టు వస్త్రాల సమర్పణ


( విజయనగరం, ఆంధ్ర ప్రభ) : ఉత్తరాంధ్ర ఇలవేల్పు.. గజపతుల ఆడపడుచు శ్రీపైడితల్లిని మాన్సాస్ చైర్మన్, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు (Pusapati Ashok Gajapathi Raju) సోమవారం దర్శించుకున్నారు. సంప్రదాయానుసారం అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా కోట నుంచి బయలుదేరి, మేళ తాళాలతో ఊరేగింపుగా పైడితల్లి ఆలయాన్ని చేరుకొని పట్టు వస్త్రాలను సమర్పించారు. పైడిమాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అశోక్ గజపతి రాజు కుటుంబానికి అధికార లాంచనాలతో ఆలయ అధికారులు (Temple authorities) స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం అశోక్ గజపతిరాజు దంపతులకు ఆలయ పూజారులు ఆశీర్వచనం పలికి, అమ్మవారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో అశోక్ గజపతిరాజు తనయ కుమార్తె, విజయనగరం శాసన సభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఇతర ప్రముఖులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.


ఏడాదిలోగా పైడితల్లి అమ్మవారి (pydithalli ammavaru) ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని అశోక్ గజపతిరాజు అన్నారు. పైడితల్లి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే అభివృద్ధి పనులను మొదలు పెట్టామని, వచ్చే ఏడాది అమ్మవారి పండగ లోపల అవన్నీ పూర్తవుతాయని చెప్పారు. పైడితల్లి అమ్మవారు ప్రజలందరిని చల్లగా చూడాలని ఆయన ఆకాంక్షించారు.

Leave a Reply