ఆవిష్కరిద్దాం
- ఉపాధి హామీలో మొక్కలు నాటుదాం
- జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా
(గుంటూరు, ఆంధ్రప్రభ) : గుంటూరు (Guntur) జిల్లాను పచ్చదనంతో నింపి హరిత గుంటూరును ఆవిష్కృతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అన్నారు. వనం – మనం జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గల ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. హరిత గుంటూరు జిల్లాలో అన్ని శాఖలు సమష్టిగా, సమన్వయంతో పనిచేయాలని అన్నారు. విద్యా సంస్థలు, ఇతర కార్యాలయాలు, ఖాళీ స్థలాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి శాఖకు నిర్దేశించిన లక్ష్యాలు, వాటిని సాధించిన లక్ష్యాలుపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఉపాధి హామీలో మొక్కలు నాటుటకు కార్యాచరణ సమర్పించాలన్నారు. జిల్లా అటవీ అధికారి హిమ శైలజ (hima sailaja) మాట్లాడుతూ… 2,443 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉన్న జిల్లాలో కేవలం 47.80 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో, 1.90 శాతం మేర మాత్రమే పచ్చడం ఉందన్నారు. మిషన్ హరిత ఆంధ్ర ప్రదేశ్ లో భాగంగా 2029 సంవత్సరం నాటికి 37 శాతం పచ్చదనం ఉండాలన్నారు. 2025 – 26 సంవత్సరంలో అన్ని శాఖల సమన్వయంతో 330 హెక్టార్లలో మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా 503 హెక్టార్లలో మొక్కలు నాటడం జరిగిందన్నారు.
2026 – 27 సంవత్సరంలో 311 హెక్టార్లలోను, 2027 – 28 సంవత్సరంలో 335 హెక్టార్లలోను, 2028 – 29 సంవత్సరంలో 344 హెక్టార్లలోను, 2029 -30 సంవత్సరంలో 365 హెక్టార్లలోను పచ్చదనం పెంచుటకు లక్ష్యంగా ఉందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ (Ashutosh Srivastava), జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, ముఖ్య ప్రణాళిక అధికారి శేష శ్రీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.