శ్రీ పైడితల్లి సంబరం
- మూడు రోజుల్లో సిరిమానోత్సవం
- ఇక విజయనగరంలో కళే కళ
- ఏర్పాట్లపై హోంమంత్రి అనిత సమీక్ష
( విజయనగరం, ఆంధ్ర ప్రభ) : శ్రీ పైడితల్లి ఉత్సవాలను (Pydithalli Ammavari Utsavam) ప్రశాంత వాతావరణంలో జరపాలని, ప్రతి సాధారణ భక్తునికి చక్కటి దర్శనం లభించేలా ఏర్పాట్లను చేయాలనీ జిల్లా ఇంచార్జ్ మంత్రి వంగలపూడి అనిత (Minister Vangalapudi Anitha) తెలిపారు. అధికారులు అందుకు తగ్గట్టుగా సన్నద్ధం కావాలని తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తో కలిసి శ్రీ పైడి తల్లి పండగ, విజయనగరం ఉత్సవాల ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. తొలుత జిల్లా కలెక్టర్ ఏర్పాట్ల పై తాము చేపట్టిన చర్యలను మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… పోలీస్ శాఖ, రెవిన్యూ , దేవస్థానం సమన్వయంగా కంట్రోల్ రూమ్ నుంచి అను నిత్యం పర్యవేక్షించాలని, విద్య్డుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, తాగునీటి అందజేయాలని, ప్లాస్టిక్ రహితంగా ఉత్సవాన్ని నిర్వహించాలని ఆదేశించారు.
టాయిలెట్ల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. మహిళలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున 170 బస్సు ల వరకు అవసరం అవుతాయని, ఆయా రూట్లలో బస్సు లను ఏర్పాటు చేయాలనీ సూచించారు. విద్యుత్తు అలంకరణలు, నగరమంతా సుందరీకరణ వారం రోజుల పాటు ఉంచాలని, పండగ వాతావరణం వెల్లి విరిసేలా ఉండాలన్నారు. ఎమ్మెల్యే పూసపాటి అథితి గజపతి రాజు (Aditi Gajapathi Raju) మాట్లాడుతూ… వీఐపీ దర్శనాలకు ఇబ్బంది కలగకుండా ప్రోటోకాల్ అధికారులు జాగ్రత్తగా చూడాలన్నారు. రథాలన్నీ తనిఖీలు చేసుకొని, వలంటీర్లకు, సేవా ప్రతినిధులకు ఐడీ కార్డులను జారీ చేయాలనీ తెలిపారు.
విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి (Collector S.Ram Sundar Reddy) మాట్లాడుతూ.. దేవాదాయ శాఖా మంత్రి ఆనం రాం నారాయణ రెడ్డి అమ్మవారికి 7 వ తేదీన ఉదయం పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, అందుకు తగ్గ ఏర్పాట్లను దేవాదాయ శాఖ వారు చేయాలనీ ఆదేశించారు. సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా, గర్భగుడిలో పూజలు ఎక్కువ సమయం నిర్వహించరాదని, ఆర నిమిషం కన్నా భక్తులను లోపల ఉంచరాదని స్పష్టం చేసారు. విజయనగరం ఉత్సవాల ఏర్పాట్ల పై సంయుక్త కలెక్టర్ సేదు మాధవన్ వివరించారు.
11 వేదికల్లో జరుగుతున్న కార్యక్రమాలను వివరిస్తూ, శనివారం సాయంత్రానికి ఏర్పాట్లు పూర్తవుతాయని తెలిపారు. కళాకారులతో చేపట్టే ప్రారంభపు ర్యాలీ కు 4 వేల మంది హాజరవుతారని, వారికీ అవసరమగు ఏర్పాట్లను , తొక్కిసలాట జరగకుండా క్రమ పధ్ధతి లో జరిగేలా నిర్వహించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశం లో జిల్లా ఎస్.పి ఏ.ఆర్. దామోదర్ , అదనపు ఎస్.పి సౌమ్య లత, కాపు కార్పొరేషన్ ఛైర్పర్సన్ యశస్వి, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

