వెయ్యి కోట్లు బకాయిలు… కంటోన్మెంట్ ఎన్నికలు నిర్వహించాలి

వెయ్యి కోట్లు బకాయిలు…
కంటోన్మెంట్ ఎన్నికలు నిర్వహించాలి

హైదరాబాద్, ఆంధ్రప్రభ : కంటోన్మెంట్ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి యూజర్ చార్జీల భాగం కింద దాదాపు రూ.1,000 కోట్లు(1,000 crores) పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని చెల్లించాలని హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్‌(Defense Minister Rajnath Singh)కు పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. ఆ లేఖలో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్(Secunderabad) కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్ సంతకాలు కూడా చేశారు.

కంటోన్మెంట్ బకాయిలను సకాలంలో క్లియరెన్స్ చేయడం వల్ల రక్షణ శాఖ పరిధిలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ప్రజా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, వారికి అవసరమైన పౌర సేవలు కొనసాగించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు లభిస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లోని కొన్ని రక్షణ శాఖ(Department of Defence) భూములను కీలకమైన ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి విడిచిపెట్టడానికి సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చిన రక్షణ మంత్రిత్వ శాఖకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్, సికింద్రాబాద్ లో నివసిస్తున్న ప్రజలకు కీలకమైన మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడంలో, పౌర సౌకర్యాలను మెరుగుపరచడంలో రక్షణ శాఖ భూములు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి పొన్నం(Minister Ponnam) తెలిపారు. ప్రజా వినియోగం కోసం కొన్ని రక్షణ భూములను ఇవ్వడానికి అంగీకరించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ భూములను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అభ్యర్థించారు.

నగర అభివృద్ధికి, ప్రజా సౌకర్యానికి అధిక ప్రాముఖ్యత కలిగిన కొనసాగుతున్న మౌలిక సదుపాయాలు, మొబిలిటీ ప్రాజెక్టుల(Mobility Projects)ను అమలు చేయడానికి ఈ భూ మార్పిడి కీలకంగా ఉందని మంత్రి అభిప్రాయ పడ్డారు.

గత కొన్ని సంవత్సరాలుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు(Cantonment Board) ఎన్నికలు జరగడం లేదని, ఈ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి కీలకమైన ఈ అంశాలపై రక్షణ మంత్రిత్వ శాఖ తగిన పరిశీలన చేస్తుందని విశ్వసిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply