టీమిండియా డామినేష‌న్..

  • విండీస్ విల‌విల

అహ్మదాబాద్ : వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు తొలి రోజున భారత జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ముగిసే సమయానికి భారత్ కేవలం 41 పరుగుల వెనుకబాటుతో బలమైన స్థితిలో నిలిచింది. విండీస్‌ను 162 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా… తొలి రోజు ముగిసే సమయానికి 121/2 స్కోరుతో పటిష్టంగా ఉంది.

బౌలర్ల విజృంభణ..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. మహ్మద్ సిరాజ్ (4/40) అద్భుతంగా బౌలింగ్ చేయగా, జస్ప్రీత్ బుమ్రా (3/42) తన అనుభవాన్ని రంగరించి వికెట్లు పడగొట్టాడు. ఇక‌ విండీస్ బ్యాట్స్‌మెన్‌లలో జస్టిన్ గ్రీవ్స్ (36) మాత్రమే టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

రాహుల్ అద్భుత అర్ధ సెంచరీ..

భారత్ ఇన్నింగ్స్‌ను యశస్వి జైస్వాల్ (36) – కేఎల్ రాహుల్ జాగ్రత్తగా ప్రారంభించారు. 20 నిమిషాల వర్ష విరామం తర్వాత వారి భాగస్వామ్యం మరింత మెరుగైంది. వీరిద్ద‌రూ ధీటుగా ఎదుర్కుంటూ మొదటి వికెట్‌కు 68 పరుగులు జోడించ‌గా… ఈ జోడీని విడ‌దీస్తూ జైస్వాల్‌ను జేడెన్ సీల్స్ ఔట్ చేశాడు. ఆ త‌రువాత వ‌చ్చిన బి సాయి సుదర్శన్ తన తొలి హోం టెస్టులో 7 పరుగులకే వెనుదిరిగాడు.

అయితే, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ కెఎల్ రాహుల్ మరోసారి తన క్లాస్‌ను ప్రదర్శించాడు. నిలకడగా ఆడుతూ… ఆరు ఫోర్ల సహాయంతో అర్ధ సెంచరీ (53) సాధించిన కేఎల్.. అద్భుతమైన ఇన్నింగ్స్‌లో నాటౌట్‌గా నిలిచాడు. చివరి గంటలో కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డా, అతడు క్రీజును వదల్లేదు.

ఇక కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (18)* రాహుల్ తో కలిసి రోజును ముగించాడు. వెస్టిండీస్ తరఫున సీల్స్, రోస్టన్ చేజ్ చెరో వికెట్ తీశారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది.

Leave a Reply