ప్రమాద స్థాయిలో వంశధార..

  • నాగావళికీ వరద ముప్పు
  • అధికారులు అప్రమత్తం..

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : వాతావరణ శాఖ సమాచారం మేరకు అటు ఒడిస్సా, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాల వేస్తున్న నేపథ్యంలో వంశధార, నాగావళి నదీ పరివాహక ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉందని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. అక్టోబర్ 3వ తేదీన ఈ నదుల్లోని ప్రధాన జల వనరుల వద్ద నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటే అవకాశం ఉందని ఫ్లడ్ ఇన్‌ఫ్లో ఫోర్‌ కాస్ట్ బులిటెన్ వెల్లడించింది.

వంశధార పరివాహక ప్రాంతంలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాల సూచన ఉంది. గొట్టా బ్యారేజీ వద్ద అక్టోబర్ 3న నది ప్రవాహం ప్రమాద హెచ్చరిక దాటే అవకాశం ఉందని, అక్టోబర్ మూడో తేదీ నాటికి వరద హెచ్చరికలు జారీ చేసే అవకాశముంది అని అధికారులు హెచ్చరించారు. మూడో ప్రమాద స్థాయికి చేరితే శ్రీకాకుళం, గార, కొత్తూరు, పోలాకి, జలుమూరు, నరసన్నపేట మండలాల్లోని సుమారు 48 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని అంచనా. రెండో స్థాయి వద్ద 39 గ్రామాలలో ముందస్తు సన్నాహకాలు చేయాలని నివేదిక తెలిపింది.

నాగావళిలో వరద ముప్పు

నాగావళి పరివాహక ప్రాంతంలో కూడా మోస్తరు నుంచి అతి భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉంది. తోటపల్లి, నారాయణపురం జల వనరుల వద్ద అక్టోబర్ 3న ప్రమాద హెచ్చరిక దాటే అవకాశముందని బులిటెన్ పేర్కొంది. దీంతో ఆమదాలవలస, బూర్జ, ఎచ్చెర్ల మండలాల్లోని 11 గ్రామాలు వరద ముప్పులో ఉండవచ్చని అధికారులు హెచ్చరించారు. తాజా బులిటెన్ తో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు, నది తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.

బుధవారం సాయంత్రం ఆయన జిల్లా అధికార యంత్రాంగంతో టెలికాంఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. రెవెన్యూ ఇంజనీరింగ్ అధికారులు వారి వారికి కేటాయించిన స్థానాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని, లైన్ డిపార్ట్మెంట్ లన్నీ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూమ్‌ 08942-240557 ను సంప్రదించాలని సూచించారు.

సహాయక బృందాలు విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ అన్నారు.కాగా గురువారం అందిన సమాచారం మేరకు రానున్న 24 గంటల్లో నాగావలి నదికి వరద వచ్చే అవకాశం ఉన్నట్లుగా జిల్లా కలెక్టర్ తెలియచేస్తూ, జిల్లా అధికార యంత్రాంగాన్ని, నదీతీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.

Leave a Reply