TG | మరో 7 ఫ్లై ఓవర్లకు ఆమోదం.. ట్రాఫిక్ నియంత్రణకు గూగుల్ సహకారం

  • కోర్ అర్బన్ అభివృద్ధి అంశాలపై సీఎం సమీక్ష

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అయిన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపలి ఏరియా మొత్తాన్నీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు, నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పారు.

ఇందుకు సంబంధించి ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన డ్రోన్ సర్వేను కోర్ అర్బన్ ఏరియా అంతటా నిర్వహించాలన్నారు. నానక్‌రామ్‌గూడలోని హెచ్ఎండీఏ (HMDA) కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కోర్ అర్బన్ అభివృద్ధి అంశాలను ముఖ్యమంత్రి సమీక్షించారు. నగరంలో మరో 7 ఫ్లై ఓవర్లు నిర్మించాలన్న ప్రతిపాదనలకు ఆయన ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు.

ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఎలాంటి అంతరాయం లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వీలుగా.. హైదరాబాద్ నగరంలో గృహనిర్మాణం, మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలన్నారు. కోర్ అర్బన్ ఏరియాలో చెరువుల పునరుద్ధరణ, కాలువల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాల‌ని అధికార‌ల‌ను ఆదేశించారు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు గూగుల్ సాంకేతిక సహకారం తీసుకుని… వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల‌ని సూచించారు. రద్దీ ఎక్కువగా ఉండే మరో 7 ప్రధాన కూడళ్లలో కూడా ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టేందుకు వీలుగా భూసేకరణ, ఇతర పనులు త్వరగా పూర్తి చేసి టెండర్లు పిలవాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో మౌలిక సదుపాయాల సలహాదారు శ్రీనివాసరాజు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇలంబర్తి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *