మైనర్లకు హోంమంత్రి క్లాస్
- లైసెన్సు ఉందా
- ఈ బండి ఎవరిది
- ఇంకెప్పుడూ ఈ బండి తోలొద్దు
( ఆంధ్రప్రభ, విజయనగరం) : విజయనగరం (Vizianagaram) చింతలవలస 5వ బెటాలియన్ సమీపంలో వేగంగా స్కూటీ నడుపుతూ దూసుకుపోతున్న ఇద్దరు పిల్లగాళ్లను గమనించిన హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) .. కాసేపు టీచరమ్మ పాత్ర పోషించారు. ఈ ఇద్దరు మైనర్లకు క్లాస్ పీకారు. అసలు ఏం జరిగిందే.. హోంమంత్రి అనిత మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు.
చింతలవలస (Chintalavalasa) 5వ బెటాలియన్ సమీపానికి చేరే సరికి ఇద్దరు మైనర్ల విన్యాశాన్ని గమనించి తన కాన్వాయ్ ని ఆపారు. వారిద్దరిని పిలిచి ప్రశ్నించారు. సుతిమెత్తగా మందలించారు. పిల్లలు వివరాలు తెలుసుకొని తల్లిదండ్రులకు సమాచారం అందించాలని పోలీసులను ఆదేశించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరం. పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రహదారి భద్రత నియమాలు (Road safety rules) పాటిస్తూ తల్లిదండ్రులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని హోం మంత్రి అనిత సూచించారు.