పరాశక్తి లలిత… శివానంద చరిత…

  • వాత్సల్య రూపిని… కరుణాకరి…..
  • శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ….
  • అట్టహాసంగా ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు….
  • ఇంద్రకీలాద్రి కి పోటెత్తుతున్న భక్తులు…
  • ఆరవ రోజు కొనసాగుతున్న భక్తుల రద్దీ..
  • శనివారం మధ్యాహ్నానికి 50 వేలకు పైగా భక్తుల రాక…
  • కనకదుర్గమ్మను దర్శించుకుంటున్న సినీ రాజకీయ రంగ ప్రముఖులు…
  • కనకదుర్గమ్మకు కనకమహాలక్ష్మి పట్టు వస్త్రాలు…
  • ఉదయం 4 గంటల నుండే ప్రారంభమైన అమ్మ దర్శనం…

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : లక్ష్మీ, సరస్వతి ఇరువైపుల వింజరామలతో సేవిస్తుండగా, చెరుకు గడను చేతపట్టి, పాసం, అంశం, పుబ్బనాలు, ధనస్సు ధరించి పరమశివుని వక్షస్థలంపై ఆసీనురాలైన శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిని భక్తులు తనివి తీరా దర్శించి తన్మయత్వంలో పులకించిపోయారు. శ్రీ విశ్వ వాసు నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు కటాక్షం ప్రసాదించారు.

ఆరవ రోజు చిరు మందహాసంతో చిద్విలాసంగా జగన్మాత శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులను కటాక్షించగా భక్తజన కోలాహంతో ఇంద్రగిరులు పలకరించిపోయాయి. శనివారం లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణ లో ఉన్న కనకదుర్గమ్మ దర్శనం కోసం తెల్లవారుజామున మూడు గంటల నుండే భక్తులు క్యూ లైన్ లలో ఎదురుచూడడం కనిపించింది. దసరా సెలవులకు తోడు వారాంతపు సెలవులు వచ్చిన నేపథ్యంలో ఇంద్రకీలాద్రి కి భక్తుల తాకిడి సందడి ఎక్కువగా నెలకొంది.

దీనికి తోడు వేళా పాలలేని వీఐపీల రాకతో సామాన్య భక్తులకు గంటల తరబడి క్యూలైన్లో దర్శనం కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. జగన్మాత దర్శనానికి సుమారు మూడు గంటలకు పైగా భక్తులు వేచి చూస్తుంటే శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయానికి 60 వేలకు పైగా భక్తులు కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఉత్సవాలలో భక్తుల కోసం ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసినప్పటికీ సామాన్య భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

భక్తుల ఇబ్బందులను అస్సలు పట్టించుకోని అధికారులు సొంత కుటుంబ సభ్యులు స్నేహితులకు మాత్రం రాజమార్గంలో అమ్మవారి దర్శన ఏర్పాటు చేస్తున్నట్లు భక్తులు విమర్శిస్తున్నారు. గంటల తరబడి అమ్మవారి దర్శనం కోసం నిరీక్షిస్తూ భక్తులు క్యూ లైన్లలో ప్రత్యక్ష నరకాన్ని చూడడం కనిపిస్తోంది.

కనకదుర్గమ్మను దర్శించుకున్న సినీనటుడు బాలకృష్ణ…

శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణ లో ఉన్న కనకదుర్గమ్మ వారిని ప్రముఖ సినీ నటుడు హిందూపూర్ ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ శనివారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఈవో శీనా నాయక్, నూతన చైర్మన్ బొర్రా గాంధీలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

లలితా దేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మ గారికి ప్రత్యేక పూజలను బాలకృష్ణ నిర్వహించగా వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఈవో చైర్మన్ బుర్ర గాంధీలు బాలకృష్ణకు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. బాలకృష్ణ తో పాటు కనకదుర్గమ్మ వారిని పలువురు జడ్జిలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు రాజకీయ సినీ రంగ ప్రముఖులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు.

కనకదుర్గమ్మకు కనకమహాలక్ష్మి పట్టు వస్త్రాలు…

దసరా నవరాత్రులలో ఆరవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారికి విశాఖపట్నంలో కొలువై ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మ వారి దేవస్థానం తరపున దేవస్థానం కార్య నిర్వహణ అధికారి కె. శోభారాణి పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు. వీరికి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సారను సమర్పించారు.

వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక ఆలయం నుంచి మరొక ఆలయానికి పట్టు వస్త్రాలు సమర్పించే ఈ సత్సాంప్రదాయం కొనసాగాలని చెప్పారు. ఇంద్రకీలాద్రి భక్త జనసంద్రంగా మారినా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్న అధికార యంత్రాంగాన్ని అభినందించారు.

అమ్మవారిని దర్శించుకున్న బ్రాహ్మణ కార్పొరేషన్, శాప్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్లు…

దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు జగన్మాతను దర్శించుకున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్, రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్, శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు, విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ప్రణవ్ గోపాల్, లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మలమూలపుటమ్మ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు.

దేవాలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందించారు. ఈ సందర్భంగా మీరు మాట్లాడుతూ అమ్మ అనుగ్రహం ప్రజలందరి పైన రాష్ట్రం పైన ఉండాలని ఆకాంక్షించారు.

Leave a Reply