హైదరాబాద్, ఆంధ్రప్రభ : మూసీ నది వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. గండిపేట వద్ద గేట్లు ఎత్తివేయడంతో ఒక్కసారిగా నగరాన్ని ముంచేసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ముఖ్యంగా చాదర్‌ఘాట్, ముసారాంబాగ్, పురానాపూల్, ఎంజీబీఎస్ వంటి ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వరద పరిస్థితిని ఎదుర్కోవడానికి హైడ్రా, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ విభాగాలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాయి.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. ఆయన ఈ రోజు చాదర్‌ఘాట్ – ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మధ్య గల ప్రాంతాలను డ్రోన్ల సహాయంతో పరిశీలించి, ప్రస్తుత పరిస్థితులను అంచనా వేశారు. అనంతరం, స్థానిక నివాసితులతో కలసి రక్షణ చర్యలపై చర్చించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించి, రక్షణ బృందాలకు పూర్తి సహకారం అందించాలని ఆయన స్థానికులకు సూచించారు. ప్రస్తుతం, అధికార యంత్రాంగం డ్రోన్ల ద్వారా వరద బాధితులకు ఆహారం, మంచినీరు అందిస్తోంది.
అధికారులు మూసీ-ఈసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. నార్సింగి, హిమాయత్‌సాగర్ వద్ద సర్వీస్ రోడ్, అలాగే మంచిరేవుల-నార్సింగి వెళ్లే మార్గాన్ని మూసివేశారు. మూసీ నది వరద కారణంగా మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS) ప్రాంగణంలోకి నీరు చేరడంతో, అక్కడి నుంచి అన్ని బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి, ప్రత్యామ్నాయ ప్రదేశాల నుంచి ప్రయాణాలు సాగించాలని కోరారు.

ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపు వెళ్లే బస్సులు ఇప్పుడు జూబ్లీ బస్ స్టేషన్ (JBS) నుంచి.. వరంగల్, హన్మకొండ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి.. సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపు వెళ్లే బస్సులు ఎల్బీ నగర్ నుంచి ప్రారంభమవుతాయని ఆర్టీసీ ప్రకటిం చింది. హబూబ్‌నగర్, కర్నూల్, బెంగళూరు రూట్ల బస్సులు ఆరంఘర్ నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రయాణికులు ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళిక వేసుకోవాలని, అవసరమైతే TGSRTC కాల్ సెంటర్ (040-69440000 / 040-23450033) ను సంప్రదించాలని అధికారులు సూచించారు.