ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి (విజయవాడ) : ఇంద్రకీలాద్రి (Indrakeeladri)పై దసరా శరన్నవరాత్రి (Dussehra Sharannavaratri) ఉత్సవాలలో హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ (film hero Nandamuri Balakrishna) సందడి నెలకొంది. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకృత కనకదుర్గమ్మ (Kanakadurgamma)ను ఆయన దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియా పాయింటులో మాట్లాడుతూ, అమ్మ అనుగ్రహం రాష్ట్రం, రాష్ట్ర ప్రజలపై ఉండాలి, అందరినీ ఒకేలా కరుణించే తల్లి దుర్గమ్మ తల్లి .తండోపతండాలుగా తరలి వస్తున్న భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలు బాగున్నాయని అన్నారు. దుర్గామాత ఈ ఏడాది 11 అవతారాలతో భక్తులపై కరుణ చూపుతోందని, ప్రతి అవతారంలోనూ భక్తులపై ఈ మహా తల్లి దుర్గమ్మ కరుణ చూపుతుందన్నారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి (ఈవో) వీకే శీనా నాయక్ (EO VK Sheena Nayak) ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నారు.
పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆలయ ప్రాంగణంలో భక్తుల అవసరాలను గమనిస్తున్నారు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా 96 మందితో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సేవా కమిటీ సభ్యులు కూడా భక్తులకు సేవలు అందిస్తున్నారు, ముదావహం అన్నారు. నవరాత్రి ఉత్సవాలలో భక్తులకు సేవలు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. అంతిమంగా భక్తులకు సంతృప్తికర దర్శనమే లక్ష్యంగా అందరూ సేవలందిస్తున్నారు, అని బాలకృష్ణ ప్రశంసించారు.

