మన రాజ్యాంగమెంతో పటిష్టం
మొన్న శ్రీలంక(SriLanka)….బంగ్లాదేశ్(Bangladesh)…నిన్న నేపాల్(Nepal)…అప్పుడప్పుడు పాకిస్థాన్(Pakistan)….అంతర్యుద్దాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ వార్తల్లో నిలుస్తున్నాయి. నిరసనలు వెల్లువెత్తి పాలకులను గద్దె దింపుతున్నాయి.
ఉవ్వెత్తున ఎగసిపడే నిరసనలకు ఆ దేశాల ప్రజానీకం యావత్తూ గొంతు కలపడం…చేయీచేయీ కలిపి ఒక్కటై నిలిచి ప్రభుత్వాల( governments)పై తమ వ్యతిరేకతలను వ్యక్తపరచడం జరుగుతోంది. “జనచైతన్యం అనేది కనిపించని భగవంతుని విశ్వరూపం” అన్నారో సినీకవి. ఈ నిరసనలను చూస్తుంటే కచ్చితంగా అది నిజమేననిపిస్తుంది.
ఎగసే ఈ నిరసన జ్వాలలు ఎంత తీవ్రంగా ఉంటున్నాయంటే, పాలకులిచ్చే హామీలతోనూ, వారితో జరిపే చర్చలతోనూ శాంతించడం లేదు. పాలకులు గద్దె దిగేదాకా పట్టుబడుతున్నాయి. ఒక్కోసారి పాలకులు ముఖం చాటేసి దేశం దాటేసేంత తీవ్రంగా ఉంటున్నాయి.
ఇంత తీవ్రమైన నిరసనలకు కారణాలు ఇవని చెప్పలేం. పాలకుల అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలు..ఇలా అనేకమున్నాయి.
అప్పటి దాకా అధికారంలో ఉన్నవి వారెన్నుకున్న ప్రజా ప్రభుత్వాలే కదా? అంటే పగ్గాలు చేతికి రాగానే పాలకులు నియంతృత్వ ధోరణులను అవలంబించడమే ప్రజాగ్రహానికి ప్రధాన కారణం.
పాకిస్థాన్(Pakistan) లో అయితే పాలకులను గద్దె దింపడంతో బాటు పగ్గాలు సైన్యం చేతిలోకి తీసుకోవడం చరిత్రలో ఎన్నోసార్లు జరిగింది. ఎవ్వరు అధికారంలో ఉన్నా, పెత్తనం మాత్రం సైన్యానిదే.
ఇవన్నీ ఒకప్పుడు సువిశాల భారతావని నుంచి విడిపోయినవే. వేరుకుంపటి కోసం తహతహలాడినవే. పరిమాణంలో చిన్నవి, మరి సుపరిపాలనతో సమర్ధంగా తమ దేశాలను అభివృద్ధిపథంలో నడిపించవచ్చు కదా?
పొరుగు దేశాలలోని పరిణామాలను గమనించినప్పుడు మన దేశంలోని ప్రజాస్వామ్యం పటిష్టత పట్ల మనకు గర్వం కలగక మానదు.
అవును మరి ఒక భవనం బీటలువారి, కుప్పకూలినప్పుడే మన భవనం పునాదులెంత బలంగా ఉన్నాయో తెలుస్తుంది.
మనది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన సువిశాల భారతం. ఇక్కడ అంతర్యుద్ధాలు అంత తేలిక కాదు. మతాల మధ్య, ప్రాంతాలవారీగా చిచ్చుపెట్టాలని ఎన్ని సంఘవిద్రోహ శక్తులు(Antisocial forces) ఎన్నిసార్లు కుయుక్తులు పన్నినా, “మేమందరమూ ఒక్కటే” అని భారతీయులందరూ(All Indians) ముక్తకంఠంతో చాటారు. మనలో మనకు రాజకీయంగా వైరుధ్యాలుండొచ్చు, కానీ మా అందరిలో దేశభక్తి మాత్రం ఒక్కటే అని రుజువు చేసారు.
మరొక ముఖ్యమైన విషయం ప్రస్తావించుకోవాలి. పటిష్టమైన ప్రజాస్వామ్య ఫలాలను మనం ఆస్వాదించ గలుగుతున్నామంటే, స్వేచ్చా వాయువులు(Free gases) పీలుస్తున్నామంటే దానికి కారణం చెక్కుచెదరని మన రాజ్యాంగ వ్యవస్థ(Constitutional system). అది ఒక గొప్ప దార్శనికుడు డా. బి. ఆర్. అంబేద్కర్(B. R. Ambedkar) దూరదృష్టి. రాజ్యాంగంలో సర్వసైన్యాధ్యక్షుడు రాష్ట్రపతే గానీ, ప్రధాని కాదు. త్రివిధ దళాలూ రాష్ట్రపతి ఆదేశాలమేరకే కట్టుబడి ఉండాలి తప్ప పాలనా పగ్గాలు తీసుకునేంత విస్తృతమైన అధికారాలు సైన్యాని(army)కి ఇవ్వబడలేదు. భారత సైన్యంలో సరిహద్దు రక్షణ, ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో ప్రజల ప్రాణాలను రక్షించడానికే తమ శక్తియుక్తులను ఒడ్డుతాయి తప్ప, అధికార కాంక్ష గురించి ఆలోచించేంత అధికారం లేదు.
సమాచార సాంకేతిక రంగంలో దూసుకుపోతూ, అగ్రరాజ్యాల(Superpowers)కు ధీటుగా నిలుస్తున్న భారత్ ని పొరుగు దేశాలు ఆదర్శంగా తీసుకోవాలి, రాజ్యాంగ సవరణలు(Constitutional Amendments) చేసుకోవాలి. భారత్ తో కయ్యానికి కాలు దువ్వే చేష్టలను మానుకొని భారత్ తో స్నేహంగా మెలిగితేనే వాటికి మనుగడ.
నేడు భారతీయుల మేధోసంపత్తి పెద్ద పెద్ద దేశాలకు ఆర్థిక బలం. భారత్ తో స్నేహం ఆ దేశాలకు అన్నివిధాలా ఉపయోగం.
అటు సుదూర లక్ష్యాల విదేశాంగ విధానాలను రూపొందించి, అంతర్గతంగా పటిష్టమైన ప్రజాస్వామ్య పరిరక్షణకు బలమైన పునాదులను వేసిన భారత రాజ్యాంగ నిర్మాత బీ.ఆర్ అంబేద్కర్(B.R. Ambedkar) దూరదృష్టిని వేనోళ్ళ కొనియాడదాం. మన రాజ్యాంగం, మన ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం…
జైహో భారత్…
