ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ప్రజలకు కోపం వస్తే ఎంతటి దేశాధినేత అయినా తోక ముడవాల్సిందే. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం పాలన సాగిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. ఇలాంటి గుణపాఠాన్ని భారత్‌కు పొరుగు దేశాలైన శ్రీలంక (Sri Lanka), బంగ్లాదేశ్ (Bangladesh) చవిచూశాయి. 2022లో శ్రీలంక, 2024లో బంగ్లాదేశ్‌లో జనంలో ఆగ్రహం, అసహనం ఉడికిపోెవడంతో అప్పటి దేశాధ్యక్షులు గద్దె దిగడమే కాదు… ఏకంగా ప్రాణాలు కాపాడుకోవడానికి దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు నేపాల్ వంతు వచ్చింది. ప్రస్తుతం నేపాల్ (Nepal) దేశంలో ప్రజాగ్రహం పెల్లుబికుతోంది. గత రెండేళ్లలో ఈ మూడు దేశాలలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రమయ్యాయి. ఈ ఆందోళనలు కేవలం వీధులను హింసతో నింపడమే కాకుండా.. పాలకుల సింహాసనాలను కూడా కూలదోశాయి. ఆర్థిక సంక్షోభం, అవినీతి, యువతలో నిరాశ వంటి సమస్యలను పాలకులు పట్టించుకోకపోవడం వల్ల దశాబ్దాలుగా అధికారంలో ఉన్న నాయకులు తమ పాలనను కోల్పోవలసి వచ్చింది.
శ్రీలంకలో ఏం జరిగిందంటే…
శ్రీలంకలో ఇలాంటి రాజకీయ అస్థిర పరిస్థితులతో భారీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవడంతో దేశంలో తీవ్ర ప్రజాందోళనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా దేశంలో ఏర్పడిన తీవ్ర నిరుద్యోగం, ఆహారం, మందుల కొరత దేశ మధ్య తరగతి ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. దీంతో వారు ఏకంగా అధ్యక్షుడి ప్యాలెస్‌పైకి దూసుకొచ్చారు. అక్కడి వస్తువులను లూటీ చేశారు. కొలంబో(Colombo)లోని ప్రధాని నివాసానికి కూడా నిప్పంటించారు. ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక అప్పటి అధ్యక్షుడు గొంటబయ రాజపక్స (Gonabaya Rajapaksa) తన భార్యతో మాల్దీవులకు పారిపోయారు.
బంగ్లాదేశ్‌లో…
2024లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా విధానాన్ని ప్రవేశపెట్టిన బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా (Sheikh Hasina) చర్యపై యువత, విద్యార్థులు తీవ్రంగా మండిపడ్డారు. హసీనాకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనను అణచివేసేందుకు ఆమె చేసిన ప్రయత్నాలలో 300 మంది మరణించారు. తర్వాత ఆందోళనకారుల పట్ల ప్రభుత్వ బలగాలు క్రూర విధానాలు అవలంబించడంతో వారు ఈసారి ఏకంగా హసీనా ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకున్నారు. వారి నిరసనలకు తలొగ్గి హసీనా ప్రభుత్వం కోటా వ్యవస్థను తగ్గించినప్పటికీ వారి ఆందోళన నెలల పాటు సాగింది. ఈ క్రమంలో అనేక హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా వేలాది మంది ఆందోళనకారులు హసీనా అధికార గృహంపైకి దండెత్తారు. దీంతో ఆమె ప్రత్యేక విమానంలో భారత్‌కు పారిపోయారు.
ఇప్పడు నేపాల్ వంతు…
సామాజిక మాధ్యమాల(social media)పై నిషేధం విధించారనే కోపంతో నేపాల్‌లో అల్లర్లు జరుగుతున్నాయి. ప్రజలు ఆ దేశ పార్లమెంట్, అధ్యక్షుడు, ప్రధాని ప్రైవేట్ నివాసాలతో పాటు సుప్రీం కోర్టుకు సైతం నిప్పు పెట్టారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలను రద్దు విషయం ఒక్కటే ఈ గొడవలకు కారణం కాదని తెలుస్తోంది. ఎన్నాళ్లుగానో ప్రభుత్వ పనితీరు మీద, నిరుద్యోగం (unemployment) మీద, అవినీతి మీద, అసమర్థత మీద జనంలో పేరుకుపోతున్న కోపం, ఇలా బద్ధలైంది. అందుకే సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలను తిరిగి స్టార్ట్ చేసినా జనంలో కోపం తగ్గడం లేదు. నేపాల్‌లో అధ్యక్షుడి ఇంటిని తగులబెట్టారు. ఓ మంత్రిని వీధుల్లో ఉరికిస్తూ కొట్టారు. పార్లమెంటును కూడా తగులబెట్టారు. అధికార పార్టీ ఆఫీసుకు అగ్గిపెట్టారు. ప్రభుత్వ భవనాలు మంటల్లో కాలిపోతున్నాయి. ప్రధాని భార్య మంటల్లో కాలిపోయింది. 73 ఏళ్ల ప్రధాని ఓలి బతుకు జీవుడా అని పారిపోయే పరిస్థితి వచ్చింది.