Bird Flu : రోజురోజుకు పడిపోతున్న చికెన్ ధరలు
కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు… ప్రతిరోజూ కాదు ప్రతిపూటా చికెన్ తినేవారు వుంటారు. ఇక హైదరాబాద్ లో వుండేవారు కనీసం వారానికి ఒక్కసారైనా చికెన్ బిర్యానీ రుచిచూడకుండా వుండలేరు…రోజూ తినేవారు కూడా వుంటారు. చికెన్ లెగ్ పీస్ ఇష్టపడేవారు కొందరయితే, మెత్తని చెస్ట్ పీస్ ను ఇష్టంగా తినేవారు మరికొందరు… ఇంకొందరు వింగ్స్, లివర్ వంటివి ఇష్టపడతారు. ఇలా చికెన్ బిర్యానీనో లేక చికెన్ కర్రీనో లేదంటే కబాబ్ వంటి స్పెషల్ వంటలో… ఏదో ఒకరూపంలో ముక్క నోట్లో పడాల్సిందే అనేవారు చాలామంది వుంటారు.
ఇలా నాన్ వెజ్ అంటే పడిచచ్చేవారు ఇప్పుడు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. చికెన్ కిలో రూ.300, రూ.400 ఉన్నపుడు కూడా వెనకడుగు వేయకుండా కొనుగోలు చేసినవారు ఇప్పుడు కిలో కాదు కోడికి కోడే కేవలం 150 రూపాయలకు ఇస్తామన్నా తీసుకోడానికి జంకుతున్నారు. నాలుక ముక్క కోసం తహతహలాడుతున్నా చికెన్ తినలేని పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని అనుకుంటున్నారు నాన్ వెజ్ ప్రియులు.
అసలు ఎందుకు చికెన్ ధరలు ఇంతలా తగ్గాయి? నాన్ వెజ్ ప్రియులు చికెన్ తినడానికి ఎందుకు జంకుతున్నారు ? ఏకంగా ప్రభుత్వాలే చికెన్ తినొద్దని ఎందుకు హెచ్చరిస్తున్నాయి ? లక్షలాదిగా కోళ్ళు ఎందుకు చనిపోతున్నాయి ?… ఈ ప్రశ్నలన్నింటిని ఒకటే సమాధానం బర్డ్ ప్లూ. ఈ మహమ్మారి వైరస్ విజృంభణతో దేశంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఆంక్షలు తప్పడంలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూతో లక్షలాదిగా కోళ్లు చనిపోతుండడంతో ఏపీ నుంచి వస్తున్న కోళ్లను తెలంగాణలో తీసుకోవడం లేదు. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కారణంగా చికెన్ ధరలు కిలో రూ.150లు ఉండగా, త్వరలో మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో బర్డ్ ఫ్లూతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.