యూరియాపై స్వయం పర్యవేక్షణ
ఉదయాన్నే గ్రామాల్లో రైతులతో మాటామంతీ
( ఆంధ్రప్రభ, కృష్ణా ప్రతినిధి)
రైతులకు యూరియా సరఫరాపై కృష్ణాజిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఇతర అవసరాలకు యూరియా తరలిపోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పీఏసీఎస్ ల ద్వారానే రైతులకు యూరియా సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ డీకే.బాలాజీ నిరంతరం పీఏసిఎస్ లను సందర్శిస్తూ యూరియా సరఫరా అవుతున్న తీరును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. డిమాండ్ పెరగడంతో ఇతర జిల్లాల నుండి 500టన్నుల యూరియాను జిల్లాకు తెప్పించారు.
రైతులతో కలెక్టర్ ఆరా
యూరియా సరఫరాపై ఉన్న అపోహలను తొలగించడానికి కలెక్టర్ డీకే.బాలాజీ శుక్రవారం ఉదయం క్షేత్రస్థాయి పర్యటన చేశారు. పామర్రు, కంకిపాడు మండలాల్లోని జజ్జవరం, కురుమద్దాలి, ఉప్పులూరు గ్రామాల్లోని రైతులతో ఆయన మాట్లాడారు. రైతులకు సమృద్ధిగా యూరియాను సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఎకరా వరి పంటకు ఉపయోగించాల్సిన యూరియా మోతాదును కూడా రైతులకు వివరించారు.