Naxals Encounter | అన్నల గుర్తింపు అతిపెద్ద సమస్య
ఎన్‌కౌంటర్ జరిగి 48 గంటలు
మృతుల్లో గుర్తించింది అయిదుగురినే
రక్తసిక్త గాయాలతో మృతదేహాలు
అబూజ్‌మడ్ కోటలో ఆగని కూంబింగ్
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ కీకారణ్యంలో ఎన్ కౌంటర్ జరిగి రెండ్రోజులు గడుస్తున్నా మృతదేహాల గుర్తింపు పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. ఆదివారం బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో 31 మంది నక్సల్స్, ఇద్దరూ జవానులు చనిపోయారు. ఘటనా స్థలి వద్ద చెల్లాచెదురుగా.. రక్త సిక్త గాయాల మధ్య పడి ఉన్న మృతదేహాల్లో ఇప్పటివరకు 11 మంది మహిళలు, 20మంది పురుషులు చనిపోయినట్టు నిర్ధారించగా, వీరిలో ఐదుగురు పేర్లు మాత్రమే ఫొటోలు ఆధారంగా గుర్తించి పోలీసులు ప్రకటన జారీ చేశారు. మిగిలిన 26 మంది నక్సల్స్ మృతదేహాల గుర్తింపు సమస్యగా మారడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో పోలీసులు తెలంగాణ, ఆంధ్ర పోలీసు అధికారులతో చర్చించి గుర్తింపు పై నిమగ్నమయ్యారు.
చనిపోయింది వీరే..
బీజాపూర్ ఎన్కౌంటర్ ఘటనలో మొత్తం 31 మందికి గాను ఐదుగురిని గుర్తించినట్టు బస్తర్ ఐజి సుందర్ రాజ్ మీడియాకు వెల్లడించారు. మృతదేహాల ఫోటోలను కూడా బయట పెట్టారు. చనిపోయిన వారిలో హుంగా కర్మ (డీసీఎం) , మంగు హే (ప్లాటున్ కమాండర్), సుభాష్ ఓ యం (ఏ సీఎం), సన్ను , గంగలూరు ఏరియా కమిటీ (ఏసియమ్), రమేష్ ఏరియా కమిటీ సభ్యుడు ఉన్నారు. వీరిపై రెండు లక్షల నుండి 8 లక్షల వరకు రివార్డ్ ఉన్నట్టు ఐజి సుందర్ రాజ్ వివరించారు.