రామ‌న్నా… జ‌ర పైలం…!

వెబ్ డెస్క్‌, ఆంద్ర‌ప్ర‌భ : ‘ రామ‌న్న‌.. నీ చెల్లిని.. ఒక మ‌హిళ ఎమ్మెల్సీ (MLC) ని… 103 రోజుల కింద‌ట నేను ఒక లేఖ రాశాను.. నా మీద కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని కూడా చెప్పాను.. కానీ ఒక్క‌సారి అయినా మీరు మాట్లాడారా?.. నాకు ఫోన్ చేశారా? ‘ అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత (K Kavitha) ప్ర‌శ్నించారు. ర‌క్త‌సంబంధం ఒక్క‌సారి ప‌క్క‌న పెడితే.. ఒక పార్టీ మ‌హిళ‌గా త‌న‌కు అన్యాయం జ‌రుగుతుందంటే ఒక పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా త‌న‌ను ఫోన్ చేయ‌రా? అని ప్ర‌శ్నించారు.

మాజీ మంత్రి హ‌రీశ్‌రావు (Harish Rao), సంతోష్‌ మ‌న కుటుంబాన్ని, పార్టీని విచ్ఛిన్నం చేయాల‌ని కుట్ర చేస్తున్నార‌ని, అది మీరు గ్ర‌హించ‌లేక‌పోతున్నార‌న్నారు. తొలుత కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయ‌డం కోసం త‌న మీద కుట్ర చేశార‌ని, త‌ర్వాత మీ మీద కుట్ర‌లు ప్రారంభ‌మ‌వుతాయ‌ని అన్నారు. హ‌రీశ్‌రావు ఎన్ని త‌ప్పులు చేసినా ఆయ‌న‌పై కేసులు లేవ‌ని, కేటీఆర్‌, కేసీఆర్ (KTR, KCR) పైనే కేసులు పెడుతున్నార‌ని అన్నారు. ఇప్ప‌టికైనా జాగ్ర‌త్త‌గా లేక‌పోతే త‌న‌లాంటి ప‌రిస్థితి మీకు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు.


భవిష్యత్తులో మరికొందరిపై హ‌రీశ్‌రావు కుట్ర‌లు చేయ‌బోతున్నార‌ని క‌విత ఆరోపించారు. ఈ రోజు త‌న మీద కుట్ర చేసినా హ‌రీశ్‌రావు, త‌ర్వాత రోజుల్లో కేటీఆర్ మీద‌, ఆ త‌ర్వాత కేసీఆర్ మీద‌, అలాగే పార్టీ చేజిక్కుంచుకోవ‌డానికి కుట్ర చేస్తార‌ని అన్నారు. 2018 జ‌రిగిన ఎన్నిక‌ల్లో సుమారు 30 మందికి హ‌రీశ్‌రావు అద‌న‌పు నిధులు ఇచ్చారని ఆరోపించారు. సిరిసిల్ల (Sirisilla) లో కేటీఆర్ ను ఓడించాల‌ని కూడా హ‌రీశ్‌రావు ప్ర‌య‌త్నం చేశార‌న్నారు. పార్టీని కూడా గతంలో వెన్నుపోటు పొడుద్దామని అనుకున్నారని, ఇందులో భాగంగా ఈటల రాజేందర్, మైనంపల్లి హనుమంత రావు సహా అంతా పార్టీ వీడారని గుర్తు చేశారు.

జగ్గారెడ్డి (Jaggareddy) తో పాటు విజయశాంతి, విజయరామారావు కూడా పార్టీని వీడింది హరీశ్ రావు వల్లేనని అన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణం కూడా హరీశ్ రావేనని కవిత తెలిపారు. ఇక సంతోష్ రావుకు ధనదాహం చాలా ఎక్కువ అని కామెంట్ చేశారు. నేరెళ్లలో ఇసుక మాఫియా విషయంలో దళితులకు చిత్రహింసలు పెట్టించింది సంతోష్ రావు (Santosh Rao) అని.. అపవాదు మాత్రం కేటీఆర్‌పై పడిందన్నారు. టానిక్ మద్యం షాపుపై కేసు పెట్టారని.. అండర్‌స్టాండింగ్‌ లేకపోతే ఆ కేసును ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలన్నారు. సినిమా హీరోల (Movie heroes) తో ఫోజులు ఇచ్చిన ఫారెస్ట్ కోట్టేయాలని సంతోష్ ప్లాన్ చేశాడని ఆరోపించారు. సంతోష్ రావు క్లాస్‌మెట్ తప్ప.. ఏ అర్హత ఉందని అతడికి పదవులు ఇచ్చారని ధ్వజమెత్తారు. హరీశ్‌ రావు, సంతోష్ రావు గ్యాంగులు కాంగ్రెస్ సర్కార్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.

Leave a Reply