ఆంధ్రప్రభ, విశాఖపట్నం (స్పోర్ట్స్) : కోట్లాది మంది కబడ్డీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈసారి వినూత్న మార్పులతో సరికొత్త ఉత్సాహం, ఉత్కంఠ భరితమైన పోరాటాలతో కనువిందు చేయబోతున్న ఈ సీజన్‌కు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ సాగర తీర నగరం వైజాగ్‌లో అట్టహాసంగా తెరలేవనుంది.

ఏడేళ్ల తర్వాత వైజాగ్‌కు తిరిగి వస్తున్న ఈ లీగ్ జాతీయ క్రీడా దినోత్సవం రోజున ప్రారంభం కానుండటం మరో విశేషం. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు, ఫేవరెట్ అయిన తెలుగు టైటాన్స్.. తమిళ్ తలైవాస్‌తో తలపడనుంది. అదే రోజు జరిగే రెండో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్, పుణెరి పల్టాన్ జట్లు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్‌లు వైజాగ్‌లోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరగనున్నాయి.

కొత్త సీజన్ కు శ్రీకారం చుడుతూ గురువారం వరుణ్ బీచ్‌లోని నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమం క్రీడాకారులు, నిర్వాహకుల ఉత్సాహంతో నిండిపోయింది. ఈ కార్యక్రమానికి మషాల్ స్పోర్ట్స్ బిజినెస్ హెడ్, ప్రో కబడ్డీ లీగ్ చైర్మన్ అనుపమ్ గోస్వామి, తెలుగు టైటాన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్, తమిళ్ తలైవాస్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ సహా మొత్తం 12 జట్ల కెప్టెన్లు హాజరయ్యారు.

అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ… ‘మరో సీజన్‌తో తిరిగి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అభిమానులను ఆటకు మరింత చేరువ చేసేలా రూపొందించిన సరికొత్త ఫార్మాట్‌తో తిరిగి వస్తున్నాం. ప్రతి మ్యాచ్‌కు ప్రాధాన్యత పెరగడంతో ఈ సీజన్ లో పోటీ తీవ్రత మరింత అధికం కానుంది. సుదీర్ఘ విరామం తర్వాత అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైజాగ్‌కు లీగ్ తిరిగి రావడం సంతోషంగా ఉంది. శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా లీగ్ దిగ్గజ క్రీడాకారులను గౌరవిస్తుంది’ అని పేర్కొన్నారు.

తెలుగు టైటాన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్ మాట్లాడుతూ ‘ఈ సీజన్ అత్యంత పోటీగా ఉంటుంది. ప్రతి జట్టు పటిష్టంగా ఉంది, ఏ మ్యాచ్ సులువు కాదు. ప్రతి విజయాన్ని కష్టపడి సాధించాల్సిందే’ అని పేర్కొన్నాడు. తమిళ్ తలైవాస్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ మాట్లాడుతూ, ‘ఆతిథ్య జట్టుతో పోరుతో కొత్త సీజన్‌ను ప్రారంభించడం మాకు మరింత స్ఫూర్తినిస్తుంది. ప్రేక్షకుల మద్దతు వారికి ఉన్నా, మేము అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ధీమా వ్యక్తం చేశాడు.

సాయుధ దళాలకు వందనం

కొత్త సీజన్ ప్రారంభానికి ముందు పీకేఎల్ నిర్వాహకులు భారత సాయుధ దళాలకు ఘన నివాళులర్పించారు. 12 మంది కెప్టెన్లు 1971 ఇండో-పాక్ యుద్ధ వీరగాథకు సాక్ష్యంగా నిలిచిన ఐఎన్ఎస్ కుర్సురా సబ్‌మెరైన్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తరఫున పీకేఎల్‌లో ఆడుతున్న దేవాంక్ (ఇండియన్ ఆర్మీ, బెంగాల్ వారియర్జ్), నవీన్ (ఇండియన్ ఎయిర్ ఫోర్స్, హర్యానా స్టీలర్స్), భరత్ (ఇండియన్ నేవీ, తెలుగు టైటాన్స్) వంటి క్రీడాకారులు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కాగా, ప్రొ కబడ్డీ లీగ్ కొత్త సీజన్ ప్రారంభానికి ముందు, అభిమానులలో ఉత్సాహాన్ని నింపేందుకు ఒక సరదా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 12 మంది పీకేఎల్ కెప్టెన్లు ప్రముఖ క్రియేటర్లతో కలిసి సరదా ఆటలు, ఛాలెంజ్‌లలో పాల్గొన్నారు. వీరు మ్యాట్ మావెరిక్స్, రైడ్ మాస్టర్స్ అనే రెండు జట్లుగా విడిపోయారు. ఈ స్నేహపూర్వక పోటీ 12వ సీజన్‌కు ముందు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది.

పీకేఎల్ 12వ సీజన్ లో భాగంగా వైజాగ్‌లో ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 11 వరకు తొలి అంచె మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత జైపూర్ (సెప్టెంబర్ 12 నుంచి సెప్టెంబర్ 28 వరకు), చెన్నై (సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 10 వరకు), న్యూఢిల్లీ (అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 23 వరకు) నగరాల్లో మిగిలిన లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికను ఇంకా నిర్ణయించలేదు.

ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లో ప్రత్యక్ష్య ప్రసారం అవుతుంది. డిస్నీప్లస్‌ హాట్‌స్టార్ యాప్‌లో లైవ్ స్ట్రీమ్ చూడొచ్చు. ఈ సీజన్ టిక్కెట్లు అధికారిక ప్లాట్‌ఫారమ్ ‘జొమాటో డిస్ట్రిక్ట్‌’లో అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలు, అప్‌డేట్‌ల కోసం అభిమానులు www.prokabaddi.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ‎

Leave a Reply