ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: రష్యాకు చెందిన టెన్నిస్ మాజీ స్టార్ మరియా షరపోవా (Sharapova), డబుల్స్ దిగ్గజాలు బ్రయాన్ సోదరులు (బాబ్, మైక్ బ్రయాన్) అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. టెన్నిస్ ప్రపంచంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ (tennis Hall of Fame)లో వారికి చోటు లభించింది. ఆదివారం జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వీరి పేర్లను టెన్నిస్ దిగ్గజాల జాబితాలో అధికారికంగా చేర్చనున్నారు.
షరపోవా టెన్నిస్ కెరీర్ అద్భుతమైన విజయాలతో నిండి ఉంది. 2004లో కేవలం 17 ఏళ్ల వయసులోనే వింబుల్డన్ టైటిల్ గెలిచి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆమె తన కెరీర్‌లో మొత్తం ఐదు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లను గెలుచుకుంది. వీటిలో 2006 యూఎస్ ఓపెన్, 2008 ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో పాటు రెండు ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు ఉన్నాయి. అంతేకాకుండా, నంబర్ 1 ర్యాంకు సాధించిన తొలి రష్యన్ మహిళా ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. 2020లో ఆమె టెన్నిస్‌కు వీడ్కోలు పలికారు.
డబుల్స్ విభాగంలో బ్రయాన్ సోదరులు సృష్టించిన రికార్డులు అసాధారణమైనవి. వీరు 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించారు. అంతేకాకుండా, వారు 438 వారాల పాటు నెంబర్ 1 ర్యాంకులో కొనసాగి చరిత్రలో నిలిచిపోయారు. వీరిద్దరి కృషి, ప్రతిభకు గుర్తింపుగా ఈ హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం లభించింది. ఈ గొప్ప టెన్నిస్ ప్లేయర్స్ జీవితకాలపు కృషికి ఈ పురస్కారం ఒక గొప్ప గుర్తింపు.