ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం (New York Road Accident) చోటుచేసుకుంది. న్యూయార్క్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదం పెంబ్రోక్ సమీపంలో జరిగిందని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. ప్రఖ్యాత నయాగరా జలపాతం అందాలను చూసేందుకు వెళ్లి తిరిగి న్యూయార్క్‌కు వస్తున్న ఓ టూరిస్టు బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 54 మంది పర్యాటకులు ఉన్నారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడిందని అధికారులు తెలిపారు. మరే ఇతర వాహనం ఈ బస్సును ఢీకొట్టలేదని స్పష్టం చేశారు. చాలామంది సీటు బెల్టులు ధరించకపోవడం వల్ల వారిని సులభంగా బయటికి తీసుకురావడం వీలయ్యిందని ఒక పోలీస్ అధికారి పేర్కొన్నారు.
ఈ విషాద ఘటన స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.40 గంటలకు జరిగింది. బస్సు బోల్తా పడిన విషయం తెలియగానే, స్థానిక యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. నాలుగు హెలికాప్టర్లు, పలు అంబులెన్స్‌లలో క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ప్రమాదానికి గురైన పర్యాటకుల్లో అత్యధికులు భారత్, చైనా, ఫిలిప్పీన్స్‌కు చెందినవారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇది ఒక విషాద ఘటన అని న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ పేర్కొన్నారు. తమ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.