• మూడో ప్రమాద హెచ్చరిక చేరువలో గోదావరి
  • అంతరాష్ట్ర రాకపోకలకు అంతరాయం
  • భద్రాచలం – వెంకటాపురం రోడ్డు బంద్
  • తూరుబాక వద్ద డైవర్షన్ రోడ్డు మునక
  • ఆంధ్రా వైపు రాకపోకలకు ఇబ్బంది


భద్రాచలం (భ‌ద్రాద్రి కొత్త‌గూడెం): భ‌ద్రాచ‌లం (Bhadrachalam) వ‌ద్ద గోదావ‌రి ఉగ్రరూపం త‌గ్గ‌లేదు. మూడో ప్ర‌మాద హెచ్చ‌రిక చేరువ‌లో నీటి ఉధృతి కొన‌సాగుతోంది. బుధవారం రాత్రి 10 గంటలకు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు గోదావరి (Godavari) 51.4 అడుగుల వద్ద కు నీటి మ‌ట్టం చేరుకుంది. ఎగువన కురిసిన భారీ వర్షాలకు వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు, ప్రాజెక్టులు నిండి ప్రవహించడంతో భద్రాచలం వద్ద వేగంగా గోదావరి వరద నీటిమట్టం పెరుగుతోంది.


తాలిపేరు ప్రాజెక్టు (Thaliperu Project) గేట్లను ఎత్తి వరద నీరును దిగువకు వదులుతున్నారు. పర్ణశాల రామాలయ సమీపంలో ఉన్న సీతవాగు పొంగడంతో స్వామివారి నార చీరల ప్రాంతం ముంపుకు గురైంది. సీతమ్మ విగ్రహం స్వామి వారి సింహాసనం నార చీరల ఆనవాళ్లు పూర్తిగా నీట మునిగి ఉన్నాయి. భద్రాచలం వద్ద రామాలయ స్నానఘట్టాలు, కళ్యాణ కట్ట, ఆంజనేయ స్వామి గుడి మండపం వద్దకు చేరి గోదావరి ప్రవహిస్తుంది. భక్తులకు గోదావరిలో స్నానాలు నిషేధించి బోర్డులు ఏర్పాటు చేశారు. మైక్ ద్వారా హెచ్చరిక జారీ చేస్తున్నారు. స్లూయిజ్ పనితీరు లోపం వల్ల అశోక్ నగర్,కొత్త కాలనీ, రామాలయ పరిసర ప్రాంతాల్లో కి నీరు చేరే అవ‌కాశ‌లు ఉన్నందున అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఇది ఇలా ఉండగా అధికారులు కొన్ని ప్రాంతాల్లో ప్రజలను ముందస్తు చర్యలలో భాగంగా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కోరారు.


దుమ్ముగూడెం మండలంలోని తూరుబాక బ్రిడ్జి డైవర్షన్ (Turubaka Bridge Diversion) రోడ్డు మీదకు వరద నీరు రావడంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెంకు రాకపోకలు అటుగా నిలిపారు. ఈ క్రమంలో వాజేడు, వెంకటాపురం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మారాయిగూడెం మీదుగా దుమ్ముగూడెం కు వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఆంధ్రాలో ఉన్న నెల్లిపాక రోడ్డు పైకి గోదావరి నీరు చేరగా, ఈ క్రమంలో కూనవరం,వి ఆర్ పురం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.


మహారాష్ట్ర (Maharashtra) లో భారీ వర్షాలు సంభవించినప్పుడు గోదావరికి భారీ స్థాయిలో వరద నీరు చేరుతుంది. నాసిక్, ముంబై వంటి ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసినప్పుడు గోదావరి నీటిమట్టం పెరగటం జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి శుక్రవారం వరకు పెరిగి అనంతరం తగ్గే అవకాశం ఉంది. ఇందుకు భిన్నంగా తెలంగాణలో, మహారాష్టలలో మళ్లీ భారీ వర్షం కురిస్తే ఇదే ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు శబరి వద్ద వరద ఉధృతి పెరిగిన భద్రాచలం వద్ద బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల మరికొద్ది రోజులు గోదావరి నిలకడగా రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో ప్రవహించే అవకాశం లేకపోలేదు. ఇది ఇలా ఉండగా అధికారులు మాత్రం మూడో ప్రమాద హెచ్చరిక పైన కూడా రెండు అడుగుల మేర పెరిగి తగ్గుతుందని భావిస్తున్నారు.

Leave a Reply