- అటవీశాఖ అభ్యంతరం.. ఆగిన రోడ్డు నిర్మాణం
వాజేడు (ములుగు జిల్లా) : ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి (Tribal Development) కి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. అయితే చట్టాలను అడ్డుపెట్టుకుని అటవీశాఖ అడుగడుగునా ఆటంకం కలిగిస్తోందని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. ములుగు జిల్లాలోని గతంలో ఆస్పత్రి, పాఠశాల భవనాల నిర్మాణానికి అటవీశాఖ అభ్యంతరం చెప్పడంతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ములుగుకు చెందిన ఆదివాసీ మహిళ ధనసరి అనసూయ ( సీతక్క) (Minister Sitakka) జోక్యం చేసుకుని జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టి కంటైనర్ పాఠశాల, కంటైనర్ ఆస్పత్రిని నిర్మించారు. అయితే రహదారుల విషయంలో మాత్రం ప్రత్యామ్నాయం (Alternative) లేకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు.
నిబంధనల పేరుతో రోడ్డు పనులను అడ్డుకున్న ఫారెస్ట్..
ములుగు జిల్లా (Mulugu District) వాజేడు మండలం పెరూరు – చెరుకూరు గ్రామాల మధ్య మావోయిస్టు ప్రభావిత ప్రాంత నిధులతో రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ నిధులతో ఎనిమిది కిలోమీటర్ల రహదారి నిర్మాణం (Road construction) చేపట్టాల్సి ఉంది. పేరూరు నుండి ధర్మవరం శివారు వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా రహదారి నిర్మాణం పూర్తి చేశారు.
అటవీశాఖ అధికారులు (Forest Department officials) అభ్యంతరం చెప్పడంతో ధర్మవరం నుంచి చెరుకూరు మధ్య మూడు కిలోమీటర్ల రహదారి నిర్మాణం నిలిచిపోయింది. మూడేళ్ల కిందట నిలిపి వేసిన ఈ రోడ్డు నిర్మాణానికి అధికారులు ఎవరూ చొరవ తీసుకోలేదు. దీంతో రోడ్డు లేక ఆదివాసులు అవస్థలు పడుతున్నారు.
ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి చిన్నచూపు తగదు!
ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూడటం తగదని గిరిజనులు (Tribal people) అన్నారు. నిబంధనల పేరుతో అభివృద్ధిని అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారన్నారు. ఒకసారి వేసిన రోడ్డుపై మరోసారి రోడ్డు వేయడానికి అటవీశాఖ అధికారులు నిబంధనల పేరుతో అభ్యంతరం (Objection) చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
గతంలో రోడ్డు వేసినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎలా వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా రహదారి నిర్మించే అవకాశాలు ఉన్నా సంబంధిత అధికారులు (concerned authorities) పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు. ఇప్పటికైనా రోడ్డు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.