ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం..

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ జిల్లా, ఇడుపులపాయలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT)లో విషాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని పీయూసీ 2 చదువుతున్న నరసింహనాయుడుగా గుర్తించారు. శుక్రవారం ఉదయం తన గదిలోని బాత్రూమ్‌లో కిటికీకి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఉదయం నుంచి అతను బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థులు తలుపులు పగలగొట్టి చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply