హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవల సమర్పించిన నివేదికను బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు. కాళేశ్వరం కమిషన్‌ రిపోర్ట్‌ అంతా తప్పుల తడక అని ఆరోపిస్తూ కేసీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్‌ రిపోర్టుపై స్టే ఇవ్వాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతోనే కమిషన్‌ను ఏర్పాటు చేసిందని, కమిషన్‌ ఇచ్చిన నివేదిక ప్రభుత్వానికి ఏది కావాలో ఆ నివేదికలో ఆ రకంగా ఉందని ఆరోపించారు. కమిషన్‌కు విచారణ చేసే అర్హత లేదని, అందువల్ల ఆ నివేదికను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు.

ఇదిలా ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన కాళేశ్వరం కమిషన్ తన నివేదికను ఇటీవల కేబినెట్‌కు సమర్పించగా, రాష్ట్ర మంత్రివర్గం దానికి ఆమోదం తెలిపింది. త్వరలోనే ఆ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అన్ని పార్టీల అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply