రామాంతపూర్‌లో చోటుచేసుకున్న విషాదకర ఘటనపై మానవ హక్కుల కమిషన్ (HRC) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల శ్రీకృష్ణాష్టమి ఊరేగింపులో విద్యుత్ తీగలు తగలడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య ఆరుగురికి పెరిగింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ (HRC) స్వయంగా సుమోటోగా కేసు నమోదు చేసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని, సెప్టెంబర్ 22లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CMD)కి నోటీసులు జారీ చేసింది.
మృతుల కుటుంబాలకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించనున్నట్లు భరోసా ఇచ్చింది. అయితే ఈ ఘటనపై HRC కఠినంగా స్పందించిన నేపథ్యంలో, విద్యుత్ శాఖ తప్పనిసరిగా సమగ్ర నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఆ నివేదిక ఆధారంగా కమిషన్ తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
జాగ్రత్తలు తప్పనిసరి..
గణేష్ నవరాత్రులు, దసరా, దీపావళి వంటి పండుగలు దగ్గరపడుతున్నాయి. ఈ సందర్భంగా కాలనీలు, వీధులు, దేవాలయాలు లైటింగ్ డెకరేషన్లతో మెరిసిపోతాయి. ముఖ్యంగా యువత ఉత్సాహంగా విద్యుత్ బల్బులు, రంగురంగుల లైటింగ్ లు అమర్చడంలో మునిగిపోతున్నారు.
అయితే, ఈ ఆనందకరమైన వేడుకలు నిర్లక్ష్యం కారణంగా విషాదాలుగా మారకుండా జాగ్రత్తలు తప్పనిసరి అని అధికారులు హెచ్చరిస్తున్నారు. రామంతపూర్ ఘటన అందరికీ ఒక హెచ్చరిక లాంటిదని, ఎలక్ట్రిక్ పనులు చేపట్టేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అలాంటి ప్రమాదాలు మళ్లీ జరిగే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.
ప్రత్యేకించి పబ్లిక్ ఊరేగింపులు, రథోత్సవాలు, గల్లీల్లో లైటింగ్ అమర్చే సమయంలో విద్యుత్ తీగలకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వైర్ల స్థితి చెక్ చేయడం, అనధికార కనెక్షన్లు తీసుకోకపోవడం, తాత్కాలిక లైటింగ్ కోసం ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు. ప్రజలు కూడా సేఫ్టీని ప్రాధాన్యంగా తీసుకుంటే ఇలాంటి విషాదాలు నివారించవచ్చని అధికారులు చెబుతున్నారు.