• ఏజేన్సీలో పెరుగుతున్న సీలేరు, శబరి, గోదావరి నదులు
  • మన్యంలో పొంగిపోర్లుతున్న వాగులు వంకలు
  • అన్నవరం వాగువద్ద సాహసం చేసిన దాటిన 200 మంది గిరిజనులు
  • ఏజేన్సీలో పలు గ్రామాలకు స్థంభించిన రాకపోకలు
  • గర్భిణీలను పడవలపై ఆసుపత్రికి తరలించిన అధికారులు
  • అవస్థలు పడుతున్న ఆదివాసీ పల్లెల ప్రజలు
  • ఆంధ్రా – ఒరిస్సా రాష్ట్రాలకు రాకపోకలు బంద్‌


చింతూరు, (ఏఎస్‌ఆర్‌ జిల్లా), ఆగ‌స్టు 19 (ఆంధ్రప్రభ): చింతూరు (Chintoor) మన్యంలో నిరంతరంగా కురుస్తున్న వర్షాలతో పాటు సీలేరు, శబరి, గోదావరి నదుల ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తూనే ఉండటంతో ఏజేన్సీలోని వాగులు వంకలు పొంగిపోర్లుతూ రహదారులపై ప్రవహిస్తూ మన్యంలోని రహదారులు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఈ ఐదు రోజులుగా తరుచూ ఎక్కడో ఒక చోట భారీ వర్షాలు కురుస్తుండటంతో, ఈ భారీ వర్షాలతో ఒకపక్క శబరి (Sabari), సీలేరు (Seeleru) నదులు మెల్లగా పెరుగుతూ వచ్చి ప్రస్తుతం నిలకడగా ఉన్నాయి. గోదావరి మాత్రం భద్రాచలం వద్ద 36.50 అడుగులకు చేరుకున్న వరద నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద నీరు వచ్చి చేరుతుంది. చింతూరు మండల కేంద్రానికి అనుకొని ప్రవహించే శబరి నది 33 అడుగుల నీటిమట్టానికి చేరుకొని తగ్గినట్లే తగ్గి మళ్ళీ మెల్లగా పెరుగుతుంది.

ఇదిలా ఉంటే అన్నవరం వాగు (Annavaram river) ఉధృతంగా ప్రవహించడంతో సోమవారం కూలీ పనులకు వెళ్ళి తిరిగి రావాడానికి ప్రజలు తీవ్ర అవస్థలు పడి ఒక పెద్ద తాడు సహాయంతో సాహసం చేసి 200 మంది వాగు దాటారు. ఆంధ్రా – ఒడిస్సా (Andhra – Odisha) రాష్ట్రాల మధ్య గల కుయుగూరు వాగు వరద నీరు జాతీయ రహదారి 326పై చేరడంతో ఆంధ్రా-ఒడిస్సా రాష్ట్రాలకు రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. ప్రధాన రహాదారులపై బ్రిడ్జిల మీద నుండి వరద నీరు ప్రవహిస్తుండటంతో మన్యంలోని పలు గిరిజన గ్రామాలకు (tribal villages) రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే ఆదివాసీ పల్లెలకు వెళ్ళడానికి చిన్న చిన్న కాలవలు, వాగులు వరద నీటితో నిండుకోవడంతో నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందకు ఆదివాసీ పల్లెల్లోని ప్రజల అవస్థలు పడుతున్నారు.


వరదల నేపధ్యంలో గర్భిణీలను ముందుగానే ఆసుపత్రులకు తరలించి సౌకర్యాలు కల్పించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. చింతూరు ఐటీడీఏ పీవో (ITDA PO) ఆదేశాల మేరకు వైద్యశాఖ అధికారులు రహదారులు మూసే గ్రామాల్లోని గర్భిణీలను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులకు, పీహెచ్‌సీలకు తరలిస్తున్నారు. అదే విధంగా ఏజేన్సీలో విస్తారంగా కురస్తున్న వర్షాల నేపధ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరదలు వస్తే ఎదుర్కోవడానికి అధికారులు సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్ (Dinesh Kumar) అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎవరూ వాగులు వంకలు దాటకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు.


చింతూరు ఏజెన్సీ (Chintoor agency) లో వరద నేపధ్యంలో నాలుగు మండలాల్లోని వాగుల వద్ద నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. మన్యంలో వాగులు, వంకలు పొంగి రహదారులను ముంచెత్తడంతో ఆయా వాగులు, వంకల వద్ద అధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు (Secretariat employees), అంగన్వాడీ సిబ్బంది వాగుల వద్ద పహారా కాస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చింతూరు మండలంలోని కుయుగూరు, కుమ్మూరు, చీకటీ వాగు, సోకిలేరు, చంద్రవంక వాగుల వద్ద అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలు ఎవరూ ఆ వాగులు దాటకుండా పటీష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. ఒక పక్క జోరు వర్షం కురుస్తున్నప్పటకీ విధుల్లోనే ఉంటూ గస్తీ నిర్వహిస్తున్నారు.

Leave a Reply