మహానంది, (ఆంధ్రప్రభ) : మహానంది క్షేత్రంలో ఒక చిన్నారిని స్థానిక ఆలయ సిబ్బంది, పోలీసులు సురక్షితంగా కాపాడారు. కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన ఒక కుటుంబం ఆదివారం దైవ దర్శనార్థం మహానందికి వచ్చారు.
క్షేత్రంలోని నంది సర్కిల్ దగ్గర కార్ పార్క్ చేసిన వారు, ఏడాది వయసున్న తమ చిన్నారిని కారులో ఉంచి, కార్ అద్దాలను పూర్తిగా మూసి, లాక్ వేసి వెళ్లారు.
ఈ సమయంలో కారులో ఉన్న చిన్నారి ఊపిరాడక కష్టపడుతూ ఉండగా, దీన్ని గమనించిన ఆలయ ఉద్యోగి ఈశ్వర్, కానిస్టేబుల్ చంద్రశేఖర్, తాత్కాలిక ఉద్యోగి నాగార్జున రెడ్డి కలసి కారు అద్దాలను పగలగొట్టి చిన్నారిని రక్షించారు.
తర్వాత, చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించి, పరిస్థితి అర్థమయ్యేలా వివరించారు. తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రాణాలను కాపాడినందుకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఘటన పునరావృతం కాకుండా చూసుకుంటామని, తమ నిర్లక్ష్యం వల్ల ఓ పెద్ద ప్రమాదం జరిగేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన ఆలయ సిబ్బంది, పోలీసులు, స్థానికులు చిన్నారిని కాపాడిన సాహసానికి అభినందనలు తెలిపారు.