సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు మనం సినిమాల్లోనే చూసి ఉండొచ్చు. గాజు తలుపులు బద్దలవుతాయి, మాస్కులు ధరించిన దుండగులు లోపలికి దూసుకెళ్తారు, సిబ్బందిని బెదిరిస్తారు… కేవలం నిమిషం, రెండు నిమిషాల వ్యవధిలోనే విలువైన వజ్రాలు, గడియారాలు గల్లంతవుతాయి. కానీ ఈసారి అలాంటి సీన్ సినిమాలో కాదు… వాస్తవంగా జరిగింది.

నాలుగురు దుండగులు, హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గని ప్రణాళికతో, కేవలం 90 సెకన్లలోనే రూ.17 కోట్లకుపైగా విలువైన వజ్రాభరణాలు, లగ్జరీ వాచీలు దోచుకెళ్లారు. ఈ ఘ‌ట‌న అమెరికాలోని సియాటెల్ నగరంలో స్థానికంగా పేరుగాంచిన మినాషే అండ్ సన్స్ నగల దుకాణం చోటుచేసుకుంది.

దుండగులు మాస్కులు ధరించి ముందుగా గాజు తలుపులు ధ్వంసం చేశారు. వెంటనే లోపలున్న సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేసి, డిస్‌ప్లేలో ఉంచిన ఆరు కేసులను లక్ష్యంగా చేసుకున్నారు. క్షణాల్లో ఆభరణాలను తమ వశం చేసుకొని పారిపోయారు. ఈ మొత్తం ఘటన అక్కడ ఉన్న‌ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

ప్రాథమిక అంచనాల ప్రకారం దోపిడీకి గురైన ఆభరణాల విలువ దాదాపు 2 మిలియన్లు అంటే దాదాపు రూ.17 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. అయితే దుకాణ యాజమాన్యం చెబుతున్నదాని ప్రకారం వాస్తవ నష్టం ఇంకా ఎక్కువే కావచ్చని భావిస్తున్నారు. కేవలం రెండు నిమిషాల్లో అంతటి భారీ దోపిడీ జరగడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించేందుకు గాలింపు కొనసాగుతోంది.

Leave a Reply