2035 నాటికి రంగంలోకి సుదర్శన చక్ర..
దేశాన్ని శత్రుదుర్భేద్యంగా మార్చడానికి, భారతదేశానికి ఒక బలమైన భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రకటించారు. శ్రీకృష్ణుడి సుదర్శన చక్రాన్ని(Sudarshan Chakra) స్ఫూర్తిగా తీసుకుని, మిషన్ సుదర్శన్ చక్ర పేరుతో ఈ ప్రాజెక్టును 2035 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ సుదర్శన చక్రం కేవలం రక్షణకు మాత్రమే పరిమితం కాకుండా, శత్రువులపై ప్రతీకారం తీర్చుకునే సామర్థ్యాన్ని (Mission Sudarshan Chakra) కూడా కలిగి ఉంటుంది. ఇది ఒక సంక్లిష్టమైన రక్షణ వ్యవస్థ. దీర్ఘ-శ్రేణి రాడార్లు, ఉపగ్రహాల ద్వారా వచ్చే నిఘా సమాచారం, విమానాలు, యూఏవీలు (డ్రోన్‌లు), మరియు దీర్ఘ-శ్రేణి ఇంటర్‌సెప్టర్ క్షిపణుల కలయికతో ఇది పనిచేస్తుంది. ఈ వ్యవస్థ శత్రువుల నుంచి వచ్చే వైమానిక దాడులైన క్షిపణులు, డ్రోన్‌లు, రాకెట్లను గగనతలంలోనే నాశనం చేయగలదు.
ఆపరేషన్ సిందూర్ వంటి గత ఆపరేషన్లలో సుదర్శన చక్రం తన సామర్థ్యాన్ని రుజువు చేసుకుంది. ఈ వ్యవస్థ దేశంలోని ప్రధాన ప్రాంతాలన్నింటిలోనూ ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇజ్రాయెల్ వంటి దేశాలు ఇప్పటికే ఇలాంటి వ్యవస్థలను ఉపయోగించి తమను రక్షించుకుంటున్నాయి. కాబట్టి ఈ ప్రాజెక్టు పూర్తయితే భారతదేశ భద్రత గణనీయంగా మెరుగుపడుతుంది. ఇది భూమి, సముద్రం మరియు గగనతలం నుంచి వచ్చే ఏ విధమైన ముప్పునైనా ఎదుర్కోగలదు.