నిజామాబాద్, (ఆంధ్రప్రభ) : రాష్ట్ర ప్రభుత్వం సమయానికి నిధులు విడుదల చేయకపోవడంతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌ల (ఆర్వోబీలు) నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వంచి రావాల్సి ఉందని, వాటి జాప్యం వల్లే పనులు పూర్తి కాలేకపోతున్నాయని ఆయన తెలిపారు.

జిల్లా ప్రజలకు ఆలస్య కారణాలు తెలిసే హక్కు ఉందని ఎంపీ స్పష్టం చేస్తూ, ఈ విషయం పై త్వరలోనే రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిని కలుస్తానని చెప్పారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మాధవనగర్, అర్సపల్లి, అడవి మామిడిపల్లి ఆర్వోబీ పనులపై కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. అడవి మామిడిపల్లి, అర్సపల్లి పనులు దాదాపు పూర్తవుతున్నా, కొంత భాగం ఇంకా పెండింగ్‌లో ఉందని చెప్పారు. గతంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి హయాంలో అడవి మామిడిపల్లి పనులకు కేటాయించిన నిధులు ఇతరత్రా మళ్లించారని గుర్తు చేశారు.

అర్సపల్లి ఆర్వోబీకి ల్యాండ్ ఆక్విజిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసినందునే అది పెండింగ్‌లో ఉందని ఎంపీ పేర్కొన్నారు. మాధవనగర్ ఆర్వోబీకి రూ.3 కోట్లు, రివైజ్‌డ్ అంచనాల ప్రకారం రూ.8.5 కోట్లు, అర్సపల్లికి రూ.10 కోట్లు విడుదల కావాల్సి ఉందని తెలిపారు. అభివృద్ధి కోసం అవసరమైన నిధులపై రాష్ట్ర ఆర్థిక మంత్రితో త్వరలోనే చర్చిస్తానని ధర్మపురి అరవింద్ తెలిపారు.

Leave a Reply